
హైదరాబాద్/చండీగఢ్, అక్టోబర్ 11, 2025:
భారత జర్నలిస్టుల సంఘం (Indian Journalists Union–IJU) ఢిల్లీలో జరిగిన అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ప్రెస్ సమావేశం నుంచి మహిళా జర్నలిస్టులను తప్పించిన ఘటనను తీవ్రంగా ఖండించింది. IJU అధ్యక్షుడు కె. శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బల్విందర్ సింగ్ జమ్ము శనివారం విడుదల చేసిన ప్రకటనలో, ఈ చర్య తాలిబాన్ ప్రభుత్వంలో నెలకొన్న మగాధిక్య (పేట్రియార్కల్) ధోరణికి నిదర్శనమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం పురుషులు, మహిళలకు సమాన హక్కులు కల్పించిన దేశంలో ఇలాంటి వివక్షాత్మక చర్య జరగడం అవమానకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వారు తెలిపారు, ఈ సంఘటన మహిళా జర్నలిస్టుల గౌరవాన్ని దెబ్బతీసిందని, అలాగే భారతదేశం కట్టుబడి ఉన్న లింగ సమానత్వం మరియు పత్రికా స్వేచ్ఛ విలువలను దెబ్బతీసిందని అన్నారు. ఇలాంటి లింగ వివక్షకు భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని IJU డిమాండ్ చేసింది. తాలిబాన్ వివక్షాత్మక విధానాలు భారత నేలపై చోటుచేసుకోవడం ఆందోళనకరమని పేర్కొంటూ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను కాపాడాలని IJU స్పష్టం చేసింది.







