
ప్రజలకోసం ప్రాణత్యాగానికి వెనుకాడని పొట్టి శ్రీరాములు జీవితం నేటి తరానికి ఆదర్శమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా హిందూ కాలేజీ జంక్షన్ లోని ఆయన విగ్రహానికి నగర కమీషనర్ పులి శ్రీనివాసులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్లా మాధవ, ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, పోరాటపటిమకు, తెలుగువారి ఆత్మగౌరవానికి పొట్టి శ్రీరాములు గారు చిహ్నంగా ఉంటారన్నారు. ఉక్కుసంకల్పంతో ప్రజల కోసం నిస్వార్ధంగా పోరాడితే సాధించలేనిది ఏమీ లేదని, ఆయన జీవితం తెలియజేస్తుందన్నారు. ప్రస్తుతం ఎక్కువమంది వ్యక్తిగత స్వార్ధ ప్రయోజనాల కోసమే వ్యవహరిస్తున్నారని, అటువంటి వారు తెలుగు జాతి కోసం ప్రాణ త్యాగం చేసిన పోట్టి శ్రీములు గారి జీవితం తెలుసుకొని ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యకమంలో డిప్యుటీ మేయర్ షేక్ సజీల, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.







