శరీరానికి పోషకాల లాగే సమాజానికి మంచి పాలసీలు అవసరం,ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ అభివృద్ధి అన్‌స్టాపబుల్,వచ్చే మూడేళ్లలో అమరావతి ఇన్‌ఫ్రా – 2027 డిసెంబర్‌కు పోలవరం పూర్తిసాగునీటితో రాయలసీమలో కోస్తాను మించిన అభివృద్ధిపీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు – ఏమాత్రం నష్టం లేదు-టెక్నాలజీతో ఇంటెన్సివ్ కేర్ కాదు.. ఇంటిదగ్గరే హెల్త్ కేర్
అమరావతి, సెప్టెంబర్ 12 : రాష్ట్ర అభివృద్ధి కోసం విజన్ కల్పన చేయటంతో పాటు దాన్ని సుసాధ్యం చేసే దిశగా పనిచేయాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. భవిష్యత్ తరాల కోసమే విజన్‌ను రూపొందించి అమలు చేస్తున్నామని.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇది తన బాధ్యత అని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో వికసిత్ భారత్-2047 అమలు చేస్తుంటే రాష్ట్రంలో స్వర్ణాంధ్ర-2047 విజన్ సిద్దం చేసి అమలు చేస్తున్నామని వెల్లడించారు. శరీరానికి పోషకాలు ఎంత అవసరమో సమాజానికి మంచి పాలసీల అవసరం అంతే ఉందని సీఎం అన్నారు. వచ్చే 22 ఏళ్లలో మన రాష్ట్రం ఎక్కడ ఉండాలన్న అంశాన్ని నిర్దేశించేందుకే విజన్ రూపొందించి అమలు చేస్తున్నట్టు వివరించారు. అమరావతిలో శుక్రవారం వే 2 న్యూస్ కాంక్లేవ్‌కు హాజరైన ముఖ్యమంత్రి వేర్వేరు అంశాలపై అభిప్రాయాలను వ్యక్తీకరించారు. వచ్చే దశాబ్ద కాలంలో ఏపీ ఎలా ఉండబోతోందన్న అంశాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…”రాష్ట్రంలోని స్టేక్ హోల్డర్లను భాగస్వాములను చేస్తూ ఈ తరహా కాంక్లేవ్ నిర్వహించడం మంచి పరిణామం. 25 ఏళ్ల క్రితం భారతీయులకు సరైన గుర్తింపు లేని సమయంలో తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి భారతదేశం అభివృద్ధి అన్‌స్టాపబుల్‌గా మారింది. 2038 నాటికి భారత దేశం నెంబర్-1 అవుతుంది. ఇందులో తెలుగు వారి పాత్ర ప్రధానంగా ఉండాలని భావిస్తున్నాను. ఈ ఏడాది..గతేడాది డబుల్ డిజిట్ గ్రోత్ సాధించగలిగాం. 2028-29 నాటికి రూ. 29,29,402 కోట్ల మేర జీఎస్డీపీ సాధించగలం. 2029-2034 నాటికి రూ. 57,21,610 కోట్ల జీఎస్డీపీ సాధించేలా ప్రణాళికలు రూపొందించాం. దీన్ని సాధించే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది. 2028-29 నాటికి తలసరి ఆదాయాన్ని రూ.5,42,985 సాధిస్తాం. 2029-2034 నాటికి తలసరి ఆదాయం రూ.10.55 లక్షల కోట్ల సాధించగలం. ఇదేమీ అసాధ్యం కాదు…నిర్థిష్టమైన ఆలోచనతోనే ప్రణాళికలు వేశాం. దీనికి సంకల్పంతో పాటు మెగా డ్రీమ్స్ ఉండాలి. విజన్ 2020 సాకారం అయ్యాక కూడా విజన్ డాక్యుమెంట్లపై ఇంకా అనుమానాలు సరికాదు. భారత్ లాంటి దేశాల్లో సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమాతరంగా అమలు చేయాలి.
సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమం చేస్తున్నాం… అభివృద్ధికి అదే తరహాలో నిధులిస్తున్నాం. రాజకీయాలు అవసరమే కానీ…సమాజం గురించే ఆలోచించాలి. రాజకీయాలే ఆలోచించి ఉంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగేది కాదు.. విద్యుత్ సంస్కరణలు వచ్చేవి కావు. సీఎంగా భావితరాల కోసం ఆలోచన చేయాలి. 1994లో చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నాను. ఇప్పుడు సంపద సృష్టిస్తున్నాం..పేదలకు అందిస్తున్నాం. ప్రజలందరికీ ప్రయోజనం కలిగేలా మంచి పబ్లిక్ పాలసీలు తీసుకువచ్చాం” అని ముఖ్యమంత్రి అన్నారు.
మూడేళ్లలో అమరావతి ఇన్‌ఫ్రా పనులు-2027 డిసెంబర్‌కు పోలవరం పూర్తి
ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశ అభివృద్ధి అన్ స్టాపబుల్ అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో సంక్షోభాలు వస్తున్నాయని.. నేపాల్, బంగ్లాదేశ్, ఫ్రాన్స్ ఇలా చాలా దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు. సుస్థిరతకు, నాయకత్వానికి మారుపేరు భారతదేశమేనని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా సంస్కరణలు ప్రారంభించి అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరించామని అన్నారు. దీనిపై మాట్లాడుతూ.. “విశాఖ, అమరావతి, విజయవాడ, తిరుపతి వంటి నగరాల అభివృద్ధిపై దృష్టి పెడుతున్నాం. సేవల రంగం ద్వారా ఎక్కువ గ్రోత్ సాధించేలా చర్యలు చేపడుతున్నాం. అమరావతిలో ప్రారంభించిన ప్రతి పని రాబోయే మూడేళ్లల్లో పూర్తి అవుతుంది. రూ.50 వేల కోట్ల విలువైన మౌలిక వసతుల పనులు పూర్తి అవుతాయి. ప్రధాని చేతుల మీదుగా ఇవి ప్రారంభం అవుతాయి. 2019లో గెలిచి ఉంటే 2021 నాటికి పోలవరం పూర్తి అయ్యేది. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతింది. అధికారంలోకి వచ్చాక పోలవరంపై దృష్టి పెట్టాం. 2027 డిసెంబరు నాటికి పోలవరం పూర్తి చేస్తాం. కియా ఫ్యాక్టరీ కోసం గొల్లపల్లి రిజర్వాయరును ఒక్క ఏడాదిలో పూర్తి చేసి నీరిచ్చాం. హంద్రీ-నీవా ప్రాజెక్టు కాల్వల విస్తరణ పనులు కేవలం 100 రోజుల్లో పూర్తి చేసి నీరు ఇచ్చాం.” అని సీఎం అన్నారు.
అమరావతి అభివృద్ధి అక్కడితో ఆగదు
“అమరావతిలో మొత్తం ప్రైవేట్ భూములే. హైటెక్ సిటి రాక ముందు హైదరాబాద్ లో ఎకరం రూ. 1 లక్ష ఉండేది…ఇప్పుడు రూ.100 కోట్లకు చేరింది. పరిశ్రమలు, రహదారుల లాంటి అభివృద్ధి జరిగితే భూమి విలువ పెరుగుతుంది. అమరావతి రైతుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగదు. అమరావతి అభివృద్ధి నిరంతరం. అభివృద్ధిని కొంత మేరకే పరిమితం చేస్తే… అమరావతి ఓ చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుంది. హైదరాబాద్ తరహాలో అమరావతి కూడా గుంటూరు-విజయవాడ-తెనాలి తదితర ప్రాంతాలు కలిసి మహానగరంగా రూపొందుతుంది. భూములిచ్చిన వారిని ఆదుకుంటాం. విస్తరణ విషయంలోనూ ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు ఉండే భూమి ఇప్పటికే సరిపోతుంది. భవిష్యత్ అవసరాల మేరకు రైతులతో మాట్లాడి అమరావతిని అభివృద్ధి చేస్తాం. అమరావతిలో 2026 జనవరికి క్వాంటం వ్యాలీ అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్‌కు అవసరమైన అనుబంధ సంస్థలు పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. అలాగే జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ విద్యా సంస్థలు కొన్ని ఉన్నాయి. మరికొన్ని రాబోతున్నాయి.” అని ముఖ్యమంత్రి తెలిపారు.
భూమి ఇస్తే మెడికల్ కాలేజీ కట్టినట్టేనా..?
మెడికల్ కళాశాలకు భూమి మాత్రమే ఇచ్చి నిర్మాణం పూర్తి అయినట్టుగా కొందరు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించిన సీఎం..పీపీపీ విధానంలో వీటిని నిర్మించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. కాలేజీలను ఎక్కడా ప్రైవేటుకు అప్పగించటం లేదని స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో నాడు నేను తీసుకున్న నిర్ణయాల వల్లే రైతు కూలీల పిల్లలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అయ్యారని అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని..వైద్య విద్యార్థులకు, వైద్య సేవలకు ఇబ్బంది రాకుండా చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఒకటికి వందసార్లు ఆలోచన చేసే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. సంజీవని ద్వారా సాంకేతికతతో అందరికీ ఆరోగ్యాన్ని అందించేలా ప్రాజెక్టును అమలు చేస్తున్నామని అన్నారు. త్వరలోనే రాష్ట్రమంతటా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. వైద్య చికిత్సలు ఇంటెన్సివ్ కేర్ లో కాకుండా ఇంటిదగ్గరే అందేలా సాంకేతికత తీసుకువస్తున్నామన్నారు. పోలవరం బనకచర్ల లింకుపై అడిగిన సీఎం ప్రశ్నకు సమాధానమిస్తూ .. గతంలో ట్యాంకర్లల్లో నీళ్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి రాయలసీమలో ఉండేదని.. ఇప్పుడు హంద్రీనీవాతో నీళ్లు ఇచ్చాక పరిస్థితి మారిందని అన్నారు. నీళ్లు ఇచ్చిన తర్వాత గోదావరి జిల్లాలతో పోలిస్తే అనంతపురం జిల్లానే జీఎస్డీపీలో అగ్రస్థానంలో ఉందన్నారు. ఉద్యాన పంటల వల్లే ఇది సాధ్యమైందన్నారు. కేవలం సముద్రంలో వృధాగా పోయే జలాలను మాత్రమే బనకచర్లకు వినియోగించుకుంటామని స్పష్టం చేశారు. అలాగే పీ4 ద్వారా పేదరికం లేని సమాజంతో పాటు ఆర్ధిక అసమానతలు రూపుమాపేందుకే నిరంతరం శ్రమిస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.