గుంటూరులో రాజకీయాలు వేడెక్కాయి. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, కార్పోరేటర్లు హాజరై కమీషనర్ తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం మేయర్ కావటి, అంబటి, అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. గుంటూరు కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాప్రతినిధులు, ప్రజలకు దురదృష్టకరంగా తయారైందని అన్నారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉండగా మేయర్ కి సమాచారం ఇవ్వకుండా కౌన్సిల్ సమావేశం నుంచి వెళ్లిపోయారని చెప్పారు. సభలో కమీషనర్ దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. పబ్లిక్ సర్వెంట్, సీనియర్ ఐఏఎస్ అధికారి ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. వాయిదా పడిన కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కమీషనర్ కి ఈనెల 7వ తేదీన లిఖిత పూర్వకంగా, వాట్సాప్, మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది తెలిపారు. అయినప్పటికీ కమీషనర్ స్పందించడం లేదని అన్నారు. చట్టప్రకారం మేయర్ కి కూడా కౌన్సిల్ సమావేశం పెట్టే అధికారం ఉందన్నారు. ఈనెల 17వ తేదీన కౌన్సిల్ సమావేశం పెట్టాల్సి ఉంటుందన్నారు. వాయిదా పడిన అనంతరం 3 రోజులకు కౌన్సిల్ సమావేశం తప్పనిసరిగా పెట్టాలన్నారు. శుక్రవారం నాడు యదావిధిగా వైసీపీ కార్పోరేటర్లు అందరూ కౌన్సిల్ సమావేశం కోసం నగరపాలక సంస్థకి చేరుకుంటారని ప్రకటించారు. కమీషనర్ ఎలా వ్యవహరిస్తారు అనే అంశంపై గమనించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వారు వెల్లడించారు.
149 1 minute read