దళిత హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జుజ్జువరపు జయరాజు గారి 55వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జుజ్జువరపు ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బేతపూడి సుదర్శన్ హాజరై జయరాజు గారి చిత్రపటానికి పూలమాల వేసి, కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన బేతపూడి సుదర్శన్ మాట్లాడుతూ జయరాజు గారి సేవలు ఎప్పటికీ మరువలేనివని, ఆయన లేని లోటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తీరనిలోటని చెప్పారు. సమాజంలో బలహీన వర్గాల హక్కులను సాధించడానికి జయరాజు గారి పోరాటం ఎంతో స్పూర్తిదాయకమని గుర్తు చేశారు.
రాష్ట్ర అధ్యక్షులు జుజ్జువరపు ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ జయరాజు గారి పోరాటం ఎప్పటికీ కొనసాగాల్సినదని, యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమాజంలోని అన్ని వెనుకబడిన వర్గాలకు సమాన హక్కులు అందించే దిశగా సమితి నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. జయరాజు గారి సాధించిన ఘనతలను గుర్తు చేస్తూ, ప్రతి దళితుడు, బహుజన వర్గానికి ఆయన ఇచ్చిన స్ఫూర్తి వెలకట్టలేనిదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెస్‌పి జిల్లా అధ్యక్షులు కందుల రమేష్, ఎస్సీ ఎస్టీ బహుజన రైట్స్ ప్రొటెక్షన్ వ్యవస్థాపక అధ్యక్షులు మేతర అజయ్, దళిత సేన అధ్యక్షులు జుజ్జువరపు రవి ప్రకాష్, ఎమ్మార్పీఎస్ టౌన్ అధ్యక్షులు గూడూరు రాజేష్ బాబు, దళిత నాయకులు బయ్యారపు కుటుంబరావు, మేతర అశోక్, జెర్రీ పోతుల జై కుమార్, బద్ది జగ్గారావు, బేతపూడి నారాయణస్వామి, ప్రసాద్, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
అంతా కలిసి జయరాజు గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాల సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు.