ఆంధ్రప్రదేశ్

Wife kills husband just a month after marriage

నువ్వంటే ఇష్టమని బతిమిలాడి వివాహం చేసుకున్న యువతి

అప్పటికే ఆమెకు ఓ బ్యాంకు ఉద్యోగితో సంబంధం

అతడే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టు సమాచారం

ఐదు రోజుల క్రితం గద్వాలలో అదృశ్యమైన తేజేశ్వర్

ఏపీలోని పాణ్యం వద్ద అతడి మృతదేహం లభ్యం

హత్యకు నిందితురాలు ఐశ్వర్య తల్లి సహకారం

పోలీసుల అదుపులో పలువురు నిందితులు?

గద్వాల : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మేఘాలయ హనీమూన్ మర్డర్’ తరహా ఘటన రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసింది. నువ్వంటే నాకు ఇష్టమని కన్నీరు పెట్టుకుని ఓ యువకుడిని నమ్మించి పెళ్లి చేసుకున్న ఓ యువతి.. పెళ్లయిన నెలరోజులకే భర్తను హత్య చేయించింది. పెళ్లికి ముందే ఓ బ్యాంకు ఉద్యోగితో ఆమెకు ఉన్న సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. సదరు బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇచ్చి నవవరుడిని హత్య చేయించగా.. ఐదురోజుల క్రితం గద్వాలలో అదృశ్యమైన నవవరుడు.. ఆదివారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్లోని పాణ్యం సమీపంలో శవమై కనిపించాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబసభ్యులు, స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్(32) ప్రైవేటు సర్వేయర్గా పని చేస్తున్నాడు. తేజేశ్వర్కు ఏపీలోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యకు ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ఐదు రోజులు ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది. కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకుకు చెందిన ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని, ఐశ్వర్య అతడి వద్దకే వెళ్లిపోయిందని అంతా అనుకున్నారు. అయితే, ఫిబ్రవరి 16న ఇంటికి తిరిగొచ్చిన ఐశ్వర్య.. తేజేశ్వర్తో ఫోన్లో మాట్లాడింది. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్నం ఇవ్వడానికి అమ్మ పడుతున్న ఇబ్బందిని చూసి తట్టుకోలేక స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం.. అంటూ విలపించింది. దీంతో ఐశ్వర్యను నమ్మిన తేజేశ్వర్ ఆమెను పెళ్లాడేందుకు అంగీకరించాడు. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఒప్పించి మే 18న ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు.

ఐశ్వర్య భర్తను పట్టించుకోకుండా నిత్యం ఫోన్లో మాట్లాడుతుండడంతో పెళ్లయిన రెండో రోజు నుంచే ఇరువురి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ఈ క్రమంలో జూన్ 17న తేజేశ్వర్ అదృశ్యమవ్వగా.. అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఐదు రోజులకు, ఆదివారం ఉదయం ఏపీలోని పాణ్యం సమీపంలోని సుగాలిమెట్ట జమ్ములో తేజేశ్వర్ మృతదేహం పోలీసులకు దొరికింది. తేజేశ్వర్ కుటుంబసభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయగా… ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను పోలీసులు విచారించగా విస్తుపోయే విషయాలు బయటికొచ్చాయి.

తల్లీకూతుళ్లతో బ్యాంకు ఉద్యోగికి సంబంధం?

ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకులో స్వీపర్గా పని చేస్తుంది. అదే బ్యాంకుకు చెందిన సదరు ఉద్యోగితో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని తెలిసింది. సదరు ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతోనూ సంబంధం పెట్టుకున్నట్టు సమాచారం. తేజేశ్వర్ను పెళ్లాడిన తర్వాత ఐశ్వర్య సదరు బ్యాంకు ఉద్యోగితో 2,000 సార్లు ఫోన్ మాట్లాడినట్టు పోలీసులు కాల్ డేటాలో గుర్తించారు. ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ ను హతమార్చాలని వారు నిర్ణయించుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

సర్వే పేరుతో పిలిపించి ప్రాణం తీశారు

తేజేశ్వర్ను హత్య చేయించేందుకు ఆ బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇవ్వడమే కాక తన డ్రైవర్ను వారి వెంట పంపినట్టు తెలిసింది. ముందస్తు పథకం ప్రకారం.. కొంతమంది వ్యక్తులు జూన్ 17న తేజేశ్వర్ను కలిశారు. తాము 10 ఎకరాల పొలం కొంటున్నామని, దాన్ని సర్వే చేయాలని చెప్పి గద్వాలలో కారు ఎక్కించుకుని తీసుకెళ్లారు.

కారులోనే తేజేశ్వర్పై కత్తులతో దాడి చేసి గొంతుకోసి చంపేసి మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు వద్ద పారవేశారు. హత్యకు ఐశ్వర్య తల్లి సుజాత కూడా సహకరించడం కొసమెరుపు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంకు ఉద్యోగి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇక, ఐశ్వర్య, సుజాతను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు.. తేజేశ్వర్ హత్యతో సంబంధం ఉన్న కొందరిని కర్నూలు జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయమై గద్వాల సీఐ టంగుటూరి శ్రీనును ‘ఆంధ్రజ్యోతి ‘ వివరణ కోరగా అనుమానితులపై నిఘా ఉంచామని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker