
యద్దనపూడి, అక్టోబర్ 12:పర్చూరు శాసనసభ్యులు శ్రీ ఏలూరి సాంబశివరావు గారి సారధ్యంలో, నోవా అగ్రి గ్రూప్ లిమిటెడ్, ఏలూరి చారిటబుల్ ట్రస్ట్ మరియు శంకర్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో, యద్దనపూడి గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది.
శిబిరానికి ముందు, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు మరియు కీ.శే. ఏలూరి నాగేశ్వరరావు గారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం శిబిరాన్ని అధికారికంగా ప్రారంభించిన క్యాంపు కార్యాలయ ప్రతినిధులు, స్థానిక మండల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
వైద్య శిబిరంలో ప్రముఖ కంటి నిపుణులు రోగులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కంటి సంబంధిత వివిధ రకాల వ్యాధుల గుర్తింపు, ఉచిత కంటి పరీక్షలు, అవసరమైన వారికి మందుల పంపిణీ, ఇంకా ఆపరేషన్ అవసరమైనవారిని గుర్తించే కార్యక్రమాలు చేపట్టారు.
శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ పేర్లను నమోదు చేసుకుని, వైద్య సేవలు పొందుతున్నారు. ఉదయం నుంచి శిబిర ప్రాంగణంలో రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద రోగుల రద్దీ అధికంగా కనిపించింది.
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని, భవిష్యత్తులో మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే శ్రీ ఏలూరి సాంబశివరావు తెలిపారు.






