సాధారణంగా ఒక మధ్యతరగతి కుటుంబానికి నెలకు వచ్చే కరెంట్ బిల్లు వందల నుంచి ఒకవేల రూపాయల మధ్యలో ఉంటూ ఉంటుంది. గరిష్టంగా వెయ్యి ఐదొందల రూపాయలు వచ్చే బిల్లే పెద్దగా అనిపిస్తుంది. కానీ, అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో నివసిస్తున్న రిటైర్డ్ టీచర్ నన్నేషా హుస్సేన్‌కు ఈసారి కరెంట్ బిల్లు చూసి నిజంగా షాక్ తగిలింది. ఎందుకంటే ఆయన ఇంటికి ఈ నెల జూలైలో ఏకంగా రూ. 15 లక్షలు 14 వేలు 993 రూపాయల బిల్లు వచ్చింది.
తనకు ప్రతినెలా సుమారు వెయ్యి మూడు వందల రూపాయల కరెంట్ బిల్లు వస్తుంటుందని, కానీ ఒక్కసారిగా ఇలా పదిహేను లక్షల బిల్లు రావడం చాలా దారుణమని రిటైర్డ్ టీచర్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లును చూసిన వెంటనే ఆయన ఆందోళనకు గురైపోయారు. ఇది ఒక పెద్ద కుటుంబానికి గానీ, లేదా ఒక ఫ్యాక్టరీకి గానీ వచ్చే బిల్లే కానీ, ఒక సాధారణ ఇంటికి ఇంత పెద్ద మొత్తం రాకూడదని చెబుతున్నారు.
ప్రభుత్వం డిజిటల్ మీటర్లు ఏర్పాటు చేసిన తర్వాత ఇలా బిల్లులు అధికంగా వస్తున్నాయని, సామాన్యులపై కరెంట్ బిల్లుల భారం రోజురోజుకు పెరుగుతుందని ఆయన వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, తాను ఇలాంటివి ఎదుర్కోవడం వల్ల మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నానని ఆయన తెలిపారు. ఇలా జరగడం వల్ల సాధారణ ప్రజలకు అవస్థలు తప్పవని, ప్రభుత్వం దీనిపై స్పష్టమైన దర్యాప్తు చేసి సమస్యను పరిష్కరించాలన్నారు.
ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఎందుకంటే, ఒక్కసారిగా ఇలా ఒక రిటైర్డ్ టీచర్ ఇంటికి పదిహేను లక్షల కరెంట్ బిల్లు రావడం అనేది అర్థం కాని అంశంగా మారింది. ఇది కేవలం సాంకేతిక లోపమా లేక వేరే ఏమైనా కారణమా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలోని మరికొంత మంది కూడా తమ బిల్లులను తిరిగి చెక్ చేయాలని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.