GUNTUR NEWS: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి – సొంత గనులను కేటాయించాలి
CPM, CPI AGITATION
కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ ప్రకటన చేయాలని, విశాఖ ఉక్కుకు సొంత గనులను కేటాయించాలని, సెయిల్‌లో విలీనం చేయాలని, ఉద్యోగులకు బకాయి జీతాలు చెల్లించాలని వివిధ కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం గుంటూరు లాడ్జి సెంటర్‌లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల సమన్వమ కమిటి ఆధ్వర్యంలో నిరసన తెలియచేశారు. ఈ సందర్భంగా సిఐటియు నగర పశ్చిమ ప్రధాన కార్యదర్శి బి.ముత్యాలరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై. నేతాజి మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని అమ్మేస్తాని ప్రకటించి దానికి అనుగుణంగా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో పోరాడి సాధించుకున్న అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు అని, దానిని గత 4 ఏళ్ళ క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తామని ప్రకటించిందని, ఆ ప్రకటనకు వ్యతిరేకంగా ఆ రోజు నుండి అక్కడ వున్న కార్మికులే కాకుండా రాష్ట్ర వ్యాపితంగా ప్రజానీకం మద్ధతుతో పోరాటం జరుగుతుందని అన్నారు. దరదృష్టవశాత్తు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకమని పైకి చెప్తున్నప్పటికీ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం చేస్తున్న చర్యలను సమర్ధిస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకు సొంత ముడి ఖనిజం గనులను కేటాయించకపోవటం నష్టాలకు కారణమవుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని కేంద్రాన్ని అడగకుండా, ఇంకా ప్రారంభం కాని మిట్టల్ ప్రైవేటు ఉక్కు పరిశ్రమకు గనులు కేటాయించాలని అడగటం అంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకం కాదని చెప్పకనే చెపుతున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విరమించుకునేవరకు పోరాటం జరుగుతుందని, కార్మికులు, ప్రజలు ఈ పోరాటాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.