

సస్యరక్షణ:కృష్ణ జిల్లాలో వరి పైరు కోత దశలోనూ,కుప్పలు పనల మీద ఉన్నది.కాస్త ఆలస్యంగా వేసిన పొలాలలో పైరు చిరు పొట్ట దశ నుండి ఈనిక దశలో ఉన్నది. ఈదురు గాలులు మరియు వర్షాల వలన పంట నష్ట తీవ్రతను తగ్గించుకునేందుకు తగు జాగ్రత్తలు పాటించవలెను.
వరి పంట చిరుపట్ట దశ నుండి ఈనిక దశలో ఉంటే అంతర్గత కాలువల ద్వారా నిల్వ ఉన్న నీటిని బయటకు పంపించాలి. పడిపోయిన పొలాలలో గింజలు రంగు మారకుండా మరియు మానుగాయ తెగులు వ్యాప్తి నివారణకు గాను ప్రొపికోనజోల్ ఒక మిల్లీలీటరు లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.గింజ గట్టి పడే దశ నుంచి కోత దశలో ఉంటే నిల్వ నీటిని బయటికి పంపే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. కంకులలో మొలకలు కనబడితే 50 గ్రాముల కళ్ళు ఉప్పును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.తద్వారా రంగు మారడమే కాకుండా గింజలు మొలకెత్తకుండా కూడా పైరును రక్షించుకోవచ్చును.
కోత కోసి కుప్పలు మీద ఉన్న ధాన్యాన్ని వర్షానికి తడవకుండా టార్పాలిన్స్ (బరకాలు) కప్పుకొని నీళ్లు చేరకుండా తగు జాగ్రత్తలు పాటించాలి.గింజలు రంగు మారకుండా మొలకెత్తకుండా ఉండేందుకు గాను కేజీ ఉప్పును 20 కేజీల పొడి ఊక తో కలిపి సుమారు క్వింటా ధాన్యానికి కలుపుకోవాలి.
మినుము పెసర పంటలు మొలక దశలో ఉన్నాయి కాబట్టి ముంపుకి గురైతే వీలైనంతవరకు పొలంలో ఉన్న మురుగునీరుని బయటకు పంపాలి. సూక్ష్మ పోషక ధాతు లోపాలు రాకుండా పంటను రక్షించుకోవాలి. ఇనుము ధాతు లోప సవరణకు అన్నభేది 20 గ్రాములు మరియు 2 గ్రాముల నిమ్మ ఉప్పుతో కలిపి పిచికారి చేసుకోవాలి. అలానే తెగుళ్ల ఉధృతి నియంత్రణకు హెక్సాకొనజోల్ రెండు మిల్లీలీటర్లు లేదా ప్రోపికొనజోల్ ఒక మిల్లీలీటరు లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవలెను.
పైన సూచించిన విధంగా తగు జాగ్రత్తలు రైతాంగం పాటించి తుఫాను వల్ల పంట నష్టాన్ని నియంత్రించుకోవాలని తెలిపారు.







