12 గంటల అరుదైన హార్ట్ శస్త్రచికిత్స విజయవంతం – డాక్టర్ కడియాల హేమకృష్ణ సాయికి అభినందనలు||12-Hour Rare Heart Surgery Successfully Performed at Capital Hospital by Dr. Kadiyala Hemakrishna Sai
12 గంటల అరుదైన హార్ట్ శస్త్రచికిత్స విజయవంతం – డాక్టర్ కడియాల హేమకృష్ణ సాయికి అభినందనలు
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం రాచూరు గ్రామానికి చెందిన బి. సత్యనారాయణ జీవితంలో ఒక క్రూరమైన మలుపు తిరిగింది. కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఊపిరి పీల్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, నడవలేని స్థితికి చేరుకున్నారు. పలువురు వైద్యులను సంప్రదించినా, చిన్ననాటి ఒక రకమైన బ్యాక్టీరియా వల్ల హృదయంలో రక్త ప్రసరణ రంధ్రాలు పూర్తిగా మూసుకుపోయినట్టు గుర్తించబడింది. ఈ పరిస్థితిని తక్షణమే శస్త్రచికిత్స ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందని వైద్యుల సూచన.
అయితే, ఆయనకు షుగర్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నందున, పలు ప్రముఖ ఆసుపత్రులు ఆపరేషన్ చేయడానికి ముందుకు రాలేకపోయాయి. కుటుంబసభ్యులు ఎంతో భయంతో చివరికి విజయవాడ బందరు రోడ్డులోని క్యాపిటల్ హాస్పిటల్‌ను ఆశ్రయించారు. అక్కడ హార్ట్ సర్జరీ స్పెషలిస్ట్ డాక్టర్ కడియాల హేమకృష్ణ సాయిని సంప్రదించారు.
సత్యనారాయణ పరిస్థితిని లోతుగా అర్థం చేసుకున్న డాక్టర్ హేమకృష్ణ సాయి, వైద్య బృందంతో కలిసి ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సకు సిద్ధమయ్యారు. సుమారు 12 గంటలపాటు నిరంతర శ్రమతో సాగిన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఇది సాధారణంగా ఎదురయ్యే సర్జరీ కాదని, అత్యంత సంక్లిష్టమైన రకాలలో ఒకటిగా వైద్యులు అభివర్ణిస్తున్నారు.
ఆపరేషన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సత్యనారాయణ భావోద్వేగానికి లోనయ్యారు. “నన్ను బతికించారని నమ్మలేకపోతున్నాను. ఓ వెలుగు చూడకుండా నేను వీల్‌చైర్‌పై హాస్పిటల్‌కి వచ్చాను. నడవలేను, ఊపిరి పీల్చుకోలేను. కాని ఇప్పుడు నాలో కొత్త జీవం వచ్చినట్టుగా ఉంది. నా పని నేనే చేసుకోగలుగుతున్నాను,” అని హృదయపూర్వకంగా చెప్పారు. ఈ మార్పుకు కారణమైన డాక్టర్ హేమకృష్ణ సాయి, ఆయన బృందం, హాస్పిటల్ సిబ్బంది అందరికీ తన కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుందని వెల్లడించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కడియాల హేమకృష్ణ సాయి మాట్లాడుతూ, క్యాపిటల్ హాస్పిటల్‌కు మూడు జాతీయ నాణ్యతా ప్రమాణాల అక్రిడేషన్లు ఉన్నట్లు, ఇది అత్యున్నత వైద్యం అందించగల సామర్థ్యం కలిగిన ఆసుపత్రిగా ఆయన పేర్కొన్నారు. “24 గంటల అత్యవసర వైద్యం అందించే స్థాయిలో మేము పనిచేస్తున్నాము. సత్యనారాయణ గారికి చేసిన శస్త్రచికిత్స అత్యంత క్లిష్టమైనదే అయినా, జట్టు కృషితో విజయవంతమైంది. ఇది మా బృందానికి గర్వకారణం,” అని తెలిపారు.
డాక్టర్ హేమకృష్ణ సాయి గతంలో కూడా పలువురు హార్ట్ రోగులకు కాంప్లికేటెడ్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ కేసులో షుగర్ లెవల్స్ అదుపులో లేకపోవడం, మెదడు, కిడ్నీల పనితీరు సరిగా లేకపోవడం వంటి ప్రమాదకర పరిస్థుతుల్లోను సర్జరీకి వెళ్లడమే గాక, రోగి పూర్తిగా కోలుకోవడం అరుదైన ఘట్టంగా వైద్య రంగంలో చర్చనీయాంశంగా మారింది.
బంధువులు, స్థానిక ప్రజలు, ఆయన గ్రామస్థులు డాక్టర్ హేమకృష్ణ సాయికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రకమైన క్లిష్టమైన చికిత్సలు ఇప్పుడు రాష్ట్రంలోనూ విజయవాడలోనూ లభిస్తున్నాయన్న ధైర్యాన్ని ఈ విజయవంతమైన ఆపరేషన్ చూపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.