
హైదరాబాద్: రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న 1200 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను తక్షణం రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ డిమాండ్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జేఏసీ నేతలు కోరారు.బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జేఏసీ కన్వీనర్ డా. పరుశురాం, కో-కన్వీనర్ డా. విజేందర్ రెడ్డి మాట్లాడుతూ — గత ఏప్రిల్‌లో కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులరైజేషన్ కోసం, యూజీసీ పే స్కేల్‌తో కూడిన ఉద్యోగ భద్రత కోసం 11 రోజులపాటు నిరవధిక సమ్మె చేసినట్లు గుర్తు చేశారు.
ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి రెగ్యులరైజేషన్‌పై హామీ ఇచ్చినందువల్లే సమ్మెను విరమించామని వారు తెలిపారు.ఆ హామీకి ఇప్పటివరకు ఆచరణ రూపం ఇవ్వకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆరు నెలలు గడిచినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సీఎం స్వయంగా జోక్యం చేసుకుని హామీని అమలు చేయాలి” అని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.ఈనెల 4న ఓస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ నుండి పరిపాలన భవనం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ ర్యాలీకి టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, ప్రొఫెసర్ హరగోపాల్ ముఖ్య అతిథులుగా హాజరవనున్నట్లు తెలిపారు.
 
 






