గుంటూరు, సెప్టెంబర్ 15 : జిల్లాలో స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత పెంచేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ 17వ తేదీన గుంటూరు సర్వజన ఆసుపత్రిలో ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. ప్రతి శాఖ పూర్తి స్థాయిలో భాగస్వామ్యం అయి విజయవంతం చేయాలని ఆయన కోరారు. కుటుంబంలోనూ, సమాజంలోనూ, జాతీయ స్థాయిలోను మహిళా సాధికారత ఉండాలనేది కార్యక్రమం లక్ష్యమని ఆయన చెప్పారు. కార్యక్రమంలో భాగంగా మహిళల మానసిక, ఆరోగ్య అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహణతో పాటు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక, ఏరియా ఆసుపత్రులలో వైద్య పరీక్షల నిర్వహణ, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆయన వివరించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ సమన్వయం చేస్తూ పోషణ అభియాన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహణతో పాటు మహిళలు కార్యక్రమంలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకునే విధంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, మెప్మ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. బాలికలు కార్యక్రమంలో పాల్గొనే విధంగా విద్యా శాఖ అధికారులు సహకరించాలని, పారిశుధ్య కార్మికులు వినియోగించుకునే విధంగా పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టడమే కాకుండా స్థానిక నాయకులు భాగస్వామ్యం అయ్యే విధంగా చూడాలని ఆయన చెప్పారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి జిల్లాలో 301 వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైద్య, అవగాహన శిబిరాలలో రక్త హీనత, క్షయ గుర్తింపు పరీక్షలు, బిపి, మధుమేహం, క్యాన్సర్ వంటి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు.
గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. అక్టోబర్ 1వ తేదీన రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, డిప్యూటీ కలెక్టర్లు ఎం గంగ రాజు, ఏ లక్ష్మీ కుమారి తదితరులు పాల్గొన్నారు.
2,302 1 minute read