
మహిళలను మాటలతో కించపరిచే చర్యలు సైతం హింస కిందనే పరిగణించాల్సి వస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ చెప్పారు. అవమానకరమైన పదాలను వాడి కించపరిచే ఏ స్థాయి వారినైనా మహిళా కమిషన్ ఉపేక్షించేదిలేదని ఆమె స్పష్టం చేశారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయా న్ని మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ సందర్శించారు. వాసవి అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక మహిళా భక్తులతో విజ్ఞప్తి మేరకు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు అక్కడి ఆలయంలో తరచూ తమకు ఎదురవుతున్న చేదు అనుభవాలను మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఎదుట ఏకరువు పెట్టారు. ఆలయ సీనియర్ ఉద్యోగి బంధువైన గణేష్ అనే వ్యక్తి అనధికారికం గా పౌరోహిత్యం చేస్తూ మహిళల పట్ల దురుసుగా మాట్లాడుతున్నారని ఫిర్యాదిచ్చారు. పవిత్రమైన క్షేత్రంలో పూజలకు వచ్చిన భక్తులు ఒక ప్రైవేటు వ్యక్తి తిట్లు, శాపనార్ధాలకు గురై మనస్తాపం చెందుతున్నారని.. ఆలయానికొచ్చే భక్తులు సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని పలువురు బాధితులు రాయపాటి శైలజకు వివరించా రు. ఈ విషయంపై ఇప్పటికే దేవాదాయ శాఖ కమిషనర్ కి సైతం ఫిర్యాదిచ్చినా పట్టించు కోలేదని..మహిళా కమిషన్ తరఫున మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని వారంతా రాయపాటి శైలజకు వినతిపత్రం అందించా రు. దీనిపై ఆలయ చైర్మన్ సత్తిబాబు, గుడి ఈవో, పెనుగొండ మండల తహసీల్దారు సమక్షంలోనే మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ స్పందిస్తూ.. పవిత్ర స్థలాల్లో మహిళా భక్తుల భద్రతపై దేవాదాయ శాఖ బాధ్యత వహించాలన్నారు.పెనుకొండలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రైవేటు వ్యక్తి దురుసు ప్రవర్తన, దుర్భాషణలపై ఆమె మండిపడ్డారు. భక్తులకు అసౌకర్యం కల్పించి దైవదర్శనానికి ఇబ్బంది కలిగిస్తున్న వ్యక్తి ప్రవర్తన హేయమైనదని.. తక్షణమే అలాంటి వారిని దూరం పెట్టాలని ఈవోని ఆదేశించారు. ఇలాంటి వారి చర్యలతో పూజనీయ స్థలాలు అపవిత్రం అవడాన్ని ప్రతీ ఒక్కరూ ఖండించాలన్నారు. పెనుగొండ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రైవేట్ వ్యక్తుల వ్యవహారశైలిపై విచారణతో చర్యలు కోరుతూ దేవాదాయ శాఖ అధికారులకు మహిళా కమిషన్ తరఫున లేఖ రాస్తామని రాయపాటి శైలజ వెల్లడించారు.







