
రైతులకు ఇబ్బంది లేకుండా సిసిఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు సజావుగా జరిగేలా పూర్తిస్థాయిలో పకడ్బందీ చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. శుక్రవారం మేడికొండూరు మండలం డోకుపర్రు గ్రామంలోని శ్రీ విజయ వెంకటేశ్వర కాటన్ మిల్స్ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తనిఖీ చేశారు. రైతుల నుంచి పత్తి కొనుగోలు ప్రక్రియకు సంబంధించి తేమశాతం పరిశీలన, లాట్ జనరేషన్, సేల్స్ ఇన్వాయిస్ విధానం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల పనితీరు, పత్తి దిగుబడులు తదితర వివరాలను జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రానికి పత్తి తీసుకువచ్చిన రైతులతో మర్యాదగా మాట్లాడి వారికి ఇబ్బందులు లేకుండా అవసరమైన సహాయ సహకారాలను మార్కెటింగ్, వ్యవసాయ శాఖ అధికారులు, సిసిఐ బయ్యర్లు అందించాలన్నారు. కర్నూలు జిల్లాలో తరహా తేమ శాతం 12 శాతం కు మించి ఒక శాతం ఎక్కువ ఉన్న కొనుగోలు చేసేందుకు ఉన్న అవకాశాలను సీసీఐ బయ్యర్లు పరిశీలించాలన్నారు. పలువురు పత్తి రైతులు కలెక్టర్ తో మాట్లాడుతూ జిల్లా నల్లరేగడి ప్రాంతం కావడం వలన తేమ శాతాన్ని 12 నుంచి 18 శాతం కు పెంచాలని కోరారు. కపాస్ కిసాన్ యాప్ సర్వర్ స్లోగా ఉండటం వల్ల స్లాట్ బుకింగ్ లో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని తెలిపారు. స్లాట్ బుక్ చేసుకున్న తేదీ రోజు కొనుగోలు కేంద్రం వద్ద రద్దీ కారణంగా సరుకు అన్లోడ్ చేయలేకపోతే తదుపరి రోజు స్లాట్ బుకింగ్ ఇబ్బంది అవుతుందని దీనితో వాహనాల కిరాయి వెయిటింగ్ చార్జీ పెరిగిపోతుందన్నారు. స్లాట్ బుకింగ్ తేదీ నుంచి కనీసం 48 గంటలు వరకు అన్లోడింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ జిల్లాలో నిర్దేశించిన మార్గదర్శకాలు ప్రకారం రైతుల నుంచి సీసీఐ కేంద్రాల ద్వారా మద్దతు ధరకు పత్తి కొనుగోలుకు వ్యవసాయ, మార్కెటింగ్, సిసిఐ అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ అన్ని చర్యలు తీసుకున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు 8 నుంచి 12 శాతం లోపు తేమ ఉండేలా, పూర్తిస్థాయిలో గ్రేడింగ్ చేసిన పత్తిని తీసుకొని రావాలని గ్రామస్థాయిలో వ్యవసాయ సహాయకులతో విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రైతుల కోరినట్టు తేమ శాతాన్ని 18 శాతం కు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కోరిందని వీటిపై ఆదేశాలు రావాల్సి ఉందన్నారు. కపాస్ కిపాన్ యాప్ లో సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని, స్లాట్ బుకింగ్ చేసుకున్న రోజు అనివార్య కారణాలవల్ల పత్తి అన్లోడింగ్ జరగకపోతే తదుపరి రోజు వరకు అన్లోడింగ్ కి అవకాశం కల్పించాలని సిసిఐ అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సమస్యలు ఉంటే జిల్లా యంత్రాంగంకు తెలియజేస్తే వెంటనే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం నాలుగు కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయని, త్వరలోనే మరిన్ని కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ ఏడి సత్యనారాయణ చౌదరి, సెక్రటరీ శివశంకర్ రెడ్డి, సీసీఐ బయ్యర్ ఉమామహేశ్వరరావు, వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.







