
మధుమేహ బాధితులలో ఇతరుల కంటే ఎక్కువగా, ముందుగానే గుండె సమస్యలు వస్తాయని, మధుమేహం బారిన పడినవారు తొలిదశ నుంచే గుండె జబ్బుల సమస్యలపై దృష్టి సారించాలని ప్రముఖ గుండె జబ్బుల వైద్య నిపుణులు డాక్టర్ షేక్ మౌలాలి అన్నారు. ఆదివారం ఉదయం స్థానిక బ్రాడీపేట లోని ఎస్ హెచ్ ఓ మీటింగ్ హాల్లో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన” గుండెజబ్బుల శాస్త్రీయ అవగాహన సభ- ఉచిత వైద్య సలహా శిబిరం”లో డాక్టర్ మౌలాలి పాల్గొని ప్రసంగించారు. సభకు సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డాక్టర్ టి. సేవ కుమార్ అధ్యక్షత వహించారు. డాక్టర్ మౌలాలి ప్రసంగాన్ని కొనసాగిస్తూ మధుమేహం బారిన పడినవారు కేవలం రక్తంలో షుగర్ శాతం మాత్రమే నియంత్రణలో ఉంచుకుంటే చాలు అనుకోకూడదన్నారు మధుమేహం మల్టీ సిస్టమిక్ డిసీస్ అని ఇది అన్ని అవయవాలపై ప్రభావం చూపుతుందన్నారు. అయితే శరీరంలోని ఇతర అవయవాలకు గుండెకు ఒక తేడా ఉన్నదన్నారు .ఇతర అవయవాలు వ్యాధుల వల్ల హఠాత్తు మరణాలు సంభవించవని, కానీ గుండె జబ్బులు సమస్యల వల్ల అర్ధాంతర మరణాలు సంభవిస్తాయన్నారు. దీర్ఘకాలమధుమేహ బాధితులు ఈసీజీ బాగున్నంత మాత్రాన గుండె జబ్బులు లేవు అనుకోకూడదు అన్నారు. గుండె లోపల రక్తనాళాల్లో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయన్నారు. రక్తం లో అధిక శాతం కొవ్వు పదార్థాలు గల వారిలో గుండె రక్తనాళాలు క్రమేపి సన్న, రక్తనాళాల్లో రక్తం అసాధారణంగా గడ్డకట్టడం జరుగుతుందన్నారు .ఆ రక్తనాళాలలో గడ్డకట్టిన రక్తం కదిలినప్పుడు గుండెపోటు వస్తుందన్నారు. షుగర్ అదుపులో ఉంచుకోవడంతో పాటు ఆహార నియమాలు క్రమం తప్పకుండా వ్యాయామం తప్పనిసరి అన్నారు .గుండె జబ్బుల లక్షణాలపై అవగాహన పెంచుకొని సరైన సమయంలో వైద్యులను సంప్రదించడం ద్వారా హఠాత్తు మరణాలను నిరోధించవచ్చునన్నారు. మధుమేహ బాధితులలో గుండెపోటు వచ్చిన పెద్దగా నొప్పి తెలియదని ,అందువలన నిర్లక్ష్యం చేస్తారన్నారు. ఈ విషయంలో మధుమేహ బాధితులు అప్రమత్తంగా ఉండాలన్నారు .సభాధ్యక్షులు డాక్టర్ టీ .సేవ కుమార్ మాట్లాడుతూ ప్రజలు మధుమేహం బారిన పడకుండా తగు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, బారిన పడినవారు శరీరంలో ప్రతి అవయవాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు .సభలో పాల్గొన్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మెడికల్ క్యాంప్స్ చైర్మన్ టి. ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో గుండెజబ్బులు పెరిగిపోవడానికి మధుమేహమే ప్రధాన కారణమన్నారు .ప్రజలు ఆరోగ్య పరిరక్షణ కు కొంత సమయం కెరటాయించాల్సిన తప్పని పరిస్థితులు వచ్చాయన్నారు .సమావేశంలో దంత వైద్య నిపుణులు డాక్టర్ చల్లా చైతన్య ,ఎస్ హెచ్ ఓ మేనేజర్ పి .నిర్మల రాణి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మేకల రామారావు, ఎన్ సాంబశివరావు, డి .సాంబి రెడ్డి పాల్గొన్నారు .-డాక్టర్ టి .సేవకుమార్ వ్యవస్థాపకులు, ఎస్ హెచ్ఓ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్, గుంటూరు.







