Guntur News: గుంటూరులో అనధికారిక మాంసం విక్రయాలపై దాడులు
CORPORATION ACTION ON NONVEG BUSINESS
ప్రజారోగ్యం దృష్ట్యా నగరంలో అనధికార చేపలు మరియు మాంసం విక్రయాల పై కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలియచేశారు. ఆదివారం నగర పాలక సంస్థ ప్రజారోగ్య అధికారులు బృందాలుగా ఏర్పడి నగరంలోని మణిపురం బ్రిడ్జ్ క్రింద చేపల మార్కెట్, నల్లపాడు రోడ్డు,రెడ్డి కాలేజీ రోడ్డు, మిర్చియార్డ్, నవభారత నగర్, గోరంట్ల, ఆర్.టి.ఓ ఆఫీసు, గుజ్జనగుండ్ల, అమరావతి రోడ్డు, పొన్నూరు రోడ్డు మరియు పట్టాభిపురం ప్రాంతాలలో రోడ్లపై అనధికారికంగా చేపలు మరియు మాంసం విక్రయిస్తున్న వారిని గుర్తించి వారిపై దాడులు నిర్వహించారు. వాటిని తొలగించి, వారి వద్ద నుండి అపరాధ రుసుము వసూలు చేయుట జరిగిందన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పరిధిలో ఎక్కడైనా అనధికారికంగా నాటుకోళ్ళు, చేపలు మరియు మాంసం విక్రయాలు జరుపు వారిపై కఠిన చర్యలు, భారీమొత్తంలో అపరాధ రుసుము విధించుటయే కాక వారి పై చట్టప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకొనుట జరుగుతుందని హెచ్చరించారు. ప్రతి వారం నగర పాలక సంస్థ ప్రజారోగ్యాదికారులు బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించుట జరుగుతుందన్నారు. నగరంలో మాంసం విక్రయాలు జరుపు యజమానులు సంబంధిత డాకుమెంట్స్ అందజేసి డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ పొంది వ్యాపారం నిర్వహించుకోవాలని, లైసెన్స్ లేని వారి షాపులను సీజ్ చేయుట జరుగుతుందని తెలిపారు. నగరంలో అనధికార మాంస విక్రయాలను అరికట్టుటకు నగర పాలక సంస్థ శానిటరీ ఇన్స్పెక్టర్లు బృందాలుగా ఏర్పడి సదరు షాప్ ల పై దాడులు నిర్వహించుట జరుగుతుందని తెలిపారు. లైసెన్స్ పొంది మాంసం విక్రయించు షాపుల యజమానులు తమ షాపు చుట్టు ప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మాంసం పై దుమ్ము, ధూళి పడకుండా మెస్ లను కట్టి ఎప్పటికప్పుడు శుభ్రత పాటించాలని తెలియచేశారు. అంతేకాక శుభ్రత పాటించని షాపుల పై ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటామని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో యం.హెచ్.ఓ డాక్టర్ రవిబాబు, వెటర్నరి డాక్టర్ వెంకటేశ్వర్లు, యస్.యస్ లు ఆనందకుమార్, సోమశేఖర్, రాంబాబు, అయుబ్ ఖాన్, శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు ఇతర ప్రజారోగ్య సిబ్బంది పాల్గొన్నారు.