బాలకృష్ణ – వెంకటేష్ మల్టీస్టారర్ కన్ఫర్మ్: టాలీవుడ్‌లో కొత్త మాస్ కాంబోకి రంగం సిద్ధం..
టాలీవుడ్‌లో ఎన్నో సంవత్సరాలుగా అభిమానులు ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ కాంబినేషన్ ఇప్పుడు అధికారికంగా రాబోతోంది. నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ కలిసి నటించనున్న మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను వెంకటేష్ స్వయంగా ప్రకటించారు. ఇటీవల అమెరికాలో జరిగిన NATS 2025 ఈవెంట్‌లో వెంకటేష్ తన భవిష్యత్ ప్రాజెక్టుల వివరాలు వెల్లడిస్తూ, “నా కెరీర్‌లో అతిపెద్ద సినిమా నా స్నేహితుడు బాలయ్యతోనే” అంటూ, బాలకృష్ణతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ ఉత్సాహం నెలకొంది.
ఇది బాలకృష్ణ, వెంకటేష్ కాంబినేషన్‌లో వస్తున్న తొలి పూర్తి స్థాయి సినిమా. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా తీయడానికి అనేక ప్రయత్నాలు జరిగినా, ఇప్పటి వరకు అవి వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మాత్రం అధికారికంగా ఇద్దరూ కలిసి నటించనున్నట్లు కన్ఫర్మేషన్ రావడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. అలాగే చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమాలో గెస్ట్ రోల్, ‘దృశ్యం 3’లో మీనాతో కలిసి నటించే ప్రాజెక్ట్‌లు కూడా ఆయన లైన్‌లో ఉన్నాయి. వీటన్నింటి తర్వాతే బాలకృష్ణతో మల్టీస్టారర్ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది.
ఇక బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని, క్రిష్, హనీఫ్ తదితర దర్శకులతో సినిమాలు చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ల తర్వాతే వెంకటేష్‌తో మల్టీస్టారర్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమా దర్శకుడు, నిర్మాతలు, కథ వివరాలు ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఈ కాంబినేషన్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య యాక్షన్, వెంకీ ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీ కలిస్తే, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. వెంకటేష్ గతంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, రామ్, నాగచైతన్య, సల్మాన్ ఖాన్, కమల్ హాసన్ వంటి స్టార్‌లతో మల్టీస్టారర్ సినిమాలు చేశారు. ఇప్పుడు బాలకృష్ణతో కలిసి నటించబోతుండటంతో ఈ కాంబోపై మరింత ఆసక్తి పెరిగింది.