“పుట్టపాక చేనేతకు జాతీయ గౌరవం | తేలియా రుమాలు ప్రత్యేకత ఏంటి?”||“Puttapaka Weavers Win National Awards | What’s Special About Telia Rumals?”
“Puttapaka Weavers Win National Awards | What’s Special About Telia Rumals?”
చేనేత కళాకారుల నైపుణ్యానికి, వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు ఉమ్మడి నల్లగొండ జిల్లా. ఈ జిల్లాకు చెందిన యాదాద్రి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకలో తయారు అయ్యే ‘తేలియా రుమాలు’ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చేనేత పురస్కారాలు పుట్టపాకకు వరించాయి.
పుట్టపాకలో సుమారు 1000 కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఇక్కడ తయారయ్యే వస్త్రాలు అంతర్జాతీయ స్థాయిలో వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రాంత చేనేత కళాకారుల ప్రతిభకు తేలియా రుమాలు ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తున్నాయి.
జాతీయ చేనేత అవార్డులు:
ప్రతి ఏటా కేంద్రం ప్రకటించే జాతీయ చేనేత అవార్డులు ఈసారి పుట్టపాకకు చెందిన ఇద్దరికి దక్కాయి. యంగ్ వీవర్ విభాగంలో గూడ పవన్ కుమార్, మార్కెటింగ్ విభాగంలో గజం నర్మదా నరేందర్ ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 19 మందిని మాత్రమే ఎంపిక చేయగా, ఆందులో తెలుగు రాష్ట్రాల నుంచి వీరికి అవార్డులు రావడం గర్వకారణం.
ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరికి అవార్డులు అందించనున్నారు.
సహజసిద్ధ రంగులతో చీరకు రూపం:
పట్టుదారాలకు సహజసిద్ధ రంగులను వినియోగించి చీరలను తయారు చేస్తున్నారు. చెట్ల పూలు, పండ్లు, వేర్లు, బంతి పువ్వులు, దానిమ్మ పండ్ల చిగుర్లు, ఇండిగో ఆకులు, వనమూలికలతో సహజంగా ఎరుపు, నీలం, పసుపు రంగులను తయారు చేస్తారు.
ఇలా చేసిన రంగులను ఉపయోగించి, జీఐ ట్యాగ్ పొందిన ‘తేలియా రుమాల్’ డిజైన్‌లో పట్టు చీరను గూడ పవన్ కుమార్ నేశారు. ఈ చీర తయారీకి ఆరు నెలలకు పైగా శ్రమించారు. ఈ చీరలో ప్రాచీన సంప్రదాయాన్ని ప్రతిబింబించే 16 ఆకృతులను సహజ రంగులతో చేర్చారు. చీర మృదుత్వంతో, ముడతలు పడకుండా తయారవుతుంది. ఒక్కో చీర ధర సుమారు రూ.75,000 ఉంటుంది.
గత ఏడాది మార్చి 17న రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎదుట మగ్గంపై వస్త్రం నేస్తూ ప్రదర్శన ఇచ్చారు. 2010లో జాతీయ చేనేత అవార్డును పొందిన తన తండ్రి గూడ శ్రీను స్ఫూర్తితో ఈ విజయం సాధించానని పవన్ కుమార్ తెలిపారు.
చేనేత వ్యాపారంలో రూ.8 కోట్ల టర్నోవర్:
నర్మదా నరేందర్ హైదరాబాదులో కొత్తపేటలో ‘నరేంద్ర హ్యాండ్లూమ్స్’ పేరుతో చేనేత వస్త్రాల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ వ్యాపారం ద్వారా రూ.8 కోట్ల విలువైన చేనేత వస్త్రాలను మార్కెట్‌లో ప్రవేశపెట్టారు.
ఇక్కత్ వస్త్రాల తయారీలో నూతన డిజైన్లను తయారు చేసి, ముంబై, ఢిల్లీ, కోల్‌కత్తా, హైదరాబాద్ నగరాలతో పాటు పలు దేశాలలోనూ విక్రయిస్తున్నారు. పుట్టపాకతో పాటు, నల్లగొండ జిల్లాలోని 300 చేనేత కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ వస్తున్నారు.
చేనేత పరిశ్రమ కనుమరుగవుతున్న సమయంలో, నర్మదా నరేందర్ తీసుకున్న ముందడుగు చేనేత పరిశ్రమను నిలబెట్టడానికి తోడ్పడింది. వీరి కృషికి గుర్తింపుగా జాతీయ చేనేత మార్కెటింగ్ విభాగంలో ఈ అవార్డు లభించింది.