బాపట్ల జిల్లా వేటపాలెం జడ్పీ హైస్కూల్లో మెగా పేరెంట్స్ కార్యక్రమం ఘనవిజయం
వేటపాలెం:
వేటపాలెం జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో గురువారం జరిగిన మెగా పేరెంట్స్ కార్యక్రమం Principal దేవరకొండ సరోజినీ, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, ఉపాధ్యాయుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, దాతలు, పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు, అతిధులు భారీగా హాజరయ్యారు. విద్యార్థులు పూల వర్షంతో అతిధులను ఆహ్వానించడం విశేష ఆకర్షణగా నిలిచింది.
తరగతి వారీగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో విద్యార్థుల విద్యాభివృద్ధిపై చర్చించారు. విద్యార్థులు తమ తల్లులకు పూలతో పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదాలు పొందడం హృద్యంగా సాగింది. ఈ పాఠశాల 117 సంవత్సరాల గొప్ప చరిత్రను ఉపాధ్యాయుడు సోమశేఖర్ వివరించారు.
ప్రస్తుత మరియు పూర్వ విద్యార్థులు తమకు ఈ పాఠశాల అందించిన విద్యా సేవలను ప్రశంసించారు. తల్లిదండ్రులతో పిల్లలను పాఠశాలకు నిరంతరం పంపించడంపై, ఇంట్లో వారికి సమయం కేటాయించడంపై, మంచి అలవాట్లు అలవరుచుకోవడంపై ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ జె.వి. సుబ్బయ్య మాట్లాడుతూ పిల్లలను సెల్‌ఫోన్లు, చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచాలని సూచించారు.
అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పిల్లలు, తల్లిదండ్రులు కలిసి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పునాది వేశారు. కార్యక్రమానంతరం సహపంక్తి భోజనం నిర్వహించబడింది. వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.