ఫిరంగిపురం దీనాపూర్ కళాశాల ఆవరణలో ఆదివారం కార్డ్స్ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ పుల్లగూర రంజన్ బాబు జయంతి, అంబేడ్కర్ దళిత ఓపెన్ యూనివర్సిటీ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా, సామాజిక రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు దళిత ఓపెన్ యూనివర్సిటీ తరఫున అంబేడ్కర్ జాతీయ అవార్డులు ప్రదానం చేశారు. వర్సిటీ వైస్ చాన్సలర్ డా. కృపాచారి మాట్లాడుతూ, పేదలు అభివృద్ధి పథంలో ముందుకు సాగితేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. డాక్టర్ స్వర్ణలతాదేవి (వెడ్స్ సంస్థ డైరెక్టర్) మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్యే శక్తి అని, చదువుతోనే వారు ఉన్నతస్థాయికి ఎదగవచ్చని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, డాక్టర్ పుల్లగూర రంజన్ బాబు 1979లో కార్డ్స్ సంస్థను స్థాపించి, గ్రామీణ ప్రాంతాల్లో పేదల జీవితాల్లో అనేక మార్పులు తీసుకొచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. 1986లో ఆయన స్థాపించిన దళిత ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చరిత్ర, సంస్కృతి, మహిళా అధ్యయనాలు, యువత అభివృద్ధి, న్యాయ విద్య వంటి అనేక కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. కార్యక్రమం ప్రారంభంలో రంజన్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్డ్స్ సంస్థ సిబ్బంది, విద్యార్థులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
228 1 minute read