ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం కి వచ్చే భక్తులకు దేవస్థానం ఒక కీలక సూచన చేసింది. రాబోయే మూడు రోజుల పాటు ఉచిత స్పర్శ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఈఓ శ్రీనివాసరావు ప్రకటించారు. ఇటీవలే శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తడంతో జలాశయం నిండుకుండలా మారింది. ఇదే సమయంలో వారాంతం తర్వాత భక్తుల రద్దీ కూడా విపరీతంగా పెరిగింది.
భక్తులకు అసౌకర్యం కలగకుండా, దర్శనాల నిర్వహణలో అవాంతరాలు రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. జూలై 16 నుండి 19 వరకు మధ్యాహ్నం 1:45 నుంచి 3:40 వరకు కల్పించే ఉచిత స్పర్శ దర్శనం ఈ నాలుగు రోజులపాటు అందుబాటులో ఉండదు. ఈ సమయంలో స్పర్శ దర్శనానికి క్యూలైన్‌లో నిలిచే భక్తులకు కేవలం అలంకార దర్శనమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.
భక్తులు ఈ విషయం తెలుసుకుని, తన యాత్రను అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది. శ్రద్ధగా, శాంతంగా, భక్తి పరవశంలో స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరింది. శ్రీశైలం దర్శనానికి వచ్చే భక్తులు ఈ సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని, తగిన ఏర్పాట్లు చేసుకుని రాగలరని అధికారులు తెలిపారు.