ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ వినియోగదారులు గమనించాల్సిన ముఖ్యమైన విషయమేది అంటే.. సిలిండర్ డెలివరీ సమయంలో రశీదులో చూపిన డబ్బులు మాత్రమే చెల్లించాలి, అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దీనిపై అధికారులు స్పష్టమైన నియమాలను పెట్టారు. అయినప్పటికీ కొన్ని జిల్లాల్లో గ్యాస్ డీలర్లు, ఏజెన్సీల సిబ్బంది సిలిండర్ డెలివరీ చేసినందుకు అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయం గురించి అధికారుల వద్ద ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి గ్యాస్ డీలర్ నుంచి 5 కిలోమీటర్ల లోపల సిలిండర్ డెలివరీ ఇచ్చినప్పుడు వినియోగదారులు ఎలాంటి డెలివరీ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. 5 నుంచి 15 కిలోమీటర్ల వరకు డెలివరీ చేస్తే రూ.20 మాత్రమే చెల్లించాలి. 15 కిలోమీటర్లకు పైగా ఉంటే రూ.30 వరకు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కానీ కొన్ని ఏజెన్సీలు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో డెలివరీ చేసినా రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు. కొన్ని నగరాల్లో ఈ చార్జీలు రూ.70 నుంచి రూ.100 వరకు కూడా వసూలు చేస్తున్నారని, దీనికి కారణం అడిగితే ‘సిలిండర్ మీరు వచ్చి తీసుకెళ్లండి’ అంటూ వినియోగదారులను బెదిరిస్తున్నారని తెలుస్తోంది.
ఇలా ప్రతి వినియోగదారుడి నుంచి చిన్న మొత్తాల్లో వసూలు చేస్తూ ఏజెన్సీలు లక్షల్లో, కోట్ల రూపాయల్లో అక్రమ వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి గ్యాస్ వినియోగదారులు 1967 కాల్ సెంటర్‌కు లేదా 1800 2333555 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని పౌరసరఫరాల శాఖ తెలిపింది. వినియోగదారులపై గ్యాస్ ఏజెన్సీలు లేదా డెలివరీ సిబ్బంది అదనపు డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వినియోగదారులు ఇకపై డెలివరీ సమయంలో సిలిండర్ బిల్లులో చూపిన ధరకు మాత్రమే డబ్బులు చెల్లించాలి. మీ ఇంటికి సిలిండర్ డెలివరీ ఇచ్చిన దూరం 5 కిలోమీటర్ల లోపు ఉంటే ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు అని గమనించాలి. ఏజెన్సీ సిబ్బంది నుంచి ఇబ్బంది ఎదురైనప్పుడు వెంటనే స్థానిక అధికారులకు లేదా పై నంబర్లకు ఫిర్యాదు చేసి మీ హక్కులను కాపాడుకోవాలి.