ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈగల్ ఐజీ రవికృష్ణతో కలిసి అమరావతి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, గంజాయి కేసుల్లో పట్టుబడిన వారికి సంక్షేమ పథకాలను నిలిపివేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, ఇకనైనా పద్దతి మార్చుకుని జీవితాలను సరిచేసుకోవాలని హెచ్చరించారు. గంజాయి సాగును అరికట్టేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు పండ్ల మొక్కలు ఇచ్చి ప్రత్యామ్నాయ జీవనోపాధిని ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. గతంలో రాష్ట్రంలో 20 వేల ఎకరాల్లో గంజాయి సాగు జరిగేదని, ఇప్పుడు అది కేవలం 90 ఎకరాలకు తగ్గించామని, త్వరలో పూర్తి స్థాయిలో గంజాయి సాగును రద్దు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
గత ఏడాది కాలంలో 831 కేసుల్లో 2,114 మంది అరెస్టు కాగా, 23,770 కిలోల గంజాయి, 27 లీటర్ల హాషిష్ ఆయిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, 293 వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. గంజాయి సాగును ప్రోత్సహించిన ఏడుగురు వ్యక్తుల 7.75 కోట్ల ఆస్తులను కూడా సీజ్ చేసినట్లు వివరించారు. ‘ఆపరేషన్ గరుడ’లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో తనిఖీలు జరిపి 150 షాపులను మూసివేశామని, ఒడిశా నుంచి వచ్చే రైళ్లలో తనిఖీలు నిర్వహించి 37 కిలోల గంజాయి, 152 గంజాయి చాక్లెట్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు ప్రాంతాలు ఒకప్పుడు గంజాయి హబ్‌గా ఉండగా, ఇప్పుడు అక్కడ మంచి కాఫీ పంటలు పండిస్తున్నట్లు తెలిపారు.
ఈగల్ టాస్క్ ఫోర్స్ రాష్ట్రవ్యాప్తంగా 325 హాట్ స్పాట్‌లను గుర్తించిందని, గిరిజనులకు ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం సహాయం చేస్తున్నామని, ఎక్సైజ్ ఆదాయంలో 2% ఈగల్ విభాగానికి కేటాయించేందుకు ప్రభుత్వం ఆలోచనలో ఉందని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఈగల్ ఐజీ రవికృష్ణ తెలిపారు. గంజాయి, డ్రగ్స్ వాడటం లేదా అమ్మకం చేస్తున్నవారిపై సమాచారం ఇవ్వాలనుకునే వారు 1972 నంబర్‌కు సమాచారం ఇవ్వగలరని, ఈగల్ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మత్తుపదార్థాల వల్ల కలిగే ప్రమాదాలను అవగాహన చేసుకోవాలని సూచించారు. గంజాయి నివారణలో భాగంగా త్వరలో ఆపరేషన్ గరుడ-2 ప్రారంభం అవుతుందని తెలిపారు.
ఈ విధంగా రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడంలో భాగంగా గంజాయి కేసులో ఇరుక్కున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, వారికి అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా నిలిపివేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఒకవైపు గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను అందించడం, మరోవైపు మత్తుపదార్థాల నియంత్రణ ద్వారా రాష్ట్రాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.