
నరసరావుపేట పట్టణ అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. బుధవారం నాడు స్థానిక ఎన్జీవో కాలనీలో ₹11 లక్షల జనరల్ ఫండ్‌తో నిర్మించబోయే సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని, ప్రజల అవసరాలను గుర్తించి వేగంగా నిధులు మంజూరు చేసి పనులు చేపడుతోందని చెప్పారు. ఈ సీసీ రోడ్ నిర్మాణం ద్వారా ఎన్జీవో కాలనీలో రవాణా సౌకర్యం మెరుగవుతుందని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, నరసరావుపేట మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షన్ 2025లో స్టార్ 1 ర్యాంకు లభించడం గర్వకారణమని అన్నారు. ఇది తెలుగుదేశం, భాజపా, జనసేన కూటమి సమిష్టి కృషి వల్ల సాధ్యమైందని వెల్లడించారు.
పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వంతో పాటు మున్సిపాల్టీ అధికారులు, ప్రజలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు బాధ్యతతో వ్యవహరిస్తే, మున్సిపాలిటీ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ డిప్యూటీ ఇంజినీర్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శంకుస్థాపన అనంతరం స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.







