రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి : రాష్ట్రంలో నగరాల అభివృద్ఢికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను నగరాల సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరుపిళ్ల తిరుమలేశ్, ఆ సామాజిక వర్గ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో ముందు ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేశ్ కు, మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలియజేశారు. నగరాలందరికీ ఒకేలా బీసీ-డీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం వల్ల ప్రభుత్వ పథకాలు అందుకునే అవకాశం కలిగిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, నగరాలను అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగరాలకు బీసీ-డీ ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆదేశించామన్నారు. గతంలో కేవలం ఉత్తరాంధ్ర, కృష్ణా జిల్లాలో మాత్రమే నగరాలకు బీసీ-డీ కుల ధ్రువీకరణ పత్రాలు అందజేసేవారన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోనూ నగరాలందరికీ బీసీ-డీ కులధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్నారన్నారు. దీనివల్ల ప్రభుత్వ పథకాలు అందే అవకాశం నగరాలకు కలిగిందన్నారు. నగరాలను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నగరాల సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరుపిళ్ల తిరుమలేశ్ మంత్రి సవిత దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవితను నగరాల సామాజిక వర్గీయులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, నగరాల సామాజిక వర్గీయులు పాల్గొన్నారు.