ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. రాష్ట్రంలో పంట సాగు ముమ్మరంగా సాగుతున్న వేళ యూరియా కొరత నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంది.
కేంద్ర రసాయనాలు అండ్ ఎరువుల శాఖ మంత్రితో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చర్చలు జరిపారు. రైతులకు యూరియా అవసరాల దృష్ట్యా రాష్ట్రానికి 10,350 మెట్రిక్ టన్నుల యూరియాను విశాఖపట్నంలోని గంగవరం పోర్టులో దిగుమతికి కేంద్రం జీవో జారీ చేసింది. యూరియా విశాఖలోని గంగవరం పోర్ట్ ద్వారా దిగుమతి కానుంది.
రాష్ట్రంలో అత్యవసరంగా యూరియా కోసం ఎదురుచూస్తున్న జిల్లాలకు యుద్ధప్రాతిపదికన యూరియా బస్తాలను పంపాలని మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గంగవరం పోర్ట్కు సెప్టెంబర్ 6వ తేదీన యూరియా షిప్ రావాల్సి ఉండగా.. రైతుల అత్యవసర అవసరాల దృష్ట్యా వారం రోజులు ముందుగానే షిప్ వచ్చేలా మంత్రి చర్యలు తీసుకున్నారు. సెప్టెంబర్ మొదటి వారం చివరిలో కాకినాడ పోర్ట్కు 30,000 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపిన మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ యూరియా కూడా రాష్ట్రంలోని రైతుల అవసరాల కోసం వినియోగించబడుతుందని చెప్పారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైన సమయంలో యూరియా అందించే బాధ్యత తమది అని మంత్రి స్పష్టం చేశారు.