
గుంటూరు…. గుంటూరు అనగానే ప్రపంచవ్యాప్తంగా అందరికీ గుర్తు వచ్చేది మిర్చి…. అయితే అంత మిర్చి ఘాటు కలిగిన గుంటూరు నగరం ఆశించినంతగా అభివృద్ధి చెందలేదు అనే అభిప్రాయం అనేక మందిలో ఉంది. విద్య, వైద్యం, రాజకీయ చైతన్యం కలిగిన గుంటూరు అభివృద్ధికి అనేక ఆటంకాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు పని చేసిన పాలకులు అభివృద్ధిపై అంతంత మాత్రమే దృష్టి పెట్టి అలా కాలం గడిపేశారు. పన్నుల రూపంలో ప్రజల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ వారికి తగిన విధంగా సౌకర్యాలు కల్పించలేదు అనేది అక్షర సత్యం. అయితే ఇటీవల కాలంలో నగరాభివృద్ధికి శ్రీకారం చుట్టిన పాలకులు ప్రధానంగా రహదారుల విస్తరణకు పనులు ప్రారంభించారు. రహదారుల విస్తరణలో భాగంగా అనేక వీధుల్లో ఆక్రమణలు తొలగింపు కూడా చేపట్టారు. సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న ఆక్రమణలు తొలగించి నూతనంగా రహదారులు నిర్మిస్తున్నారు. కానీ నూతన రహదారులు ఏర్పాటు చేసిన వెనువెంటనే మళ్ళీ తిరిగి యధా స్థానంలో ఆక్రమణలు రోడ్డుపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రహదారులను ఆక్రమించకుండా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారుల పైన ఉంది. కానీ ఆ దిశగా ఏమాత్రం చర్యలు చేపట్టటం లేదు. ఫలితంగా యధావిధిగా ఆక్రమణలు చోటుచేసుకుని నగర నగరాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయి. రహదారిని అభివృద్ధి చేస్తున్న సమయంలోనే స్థానిక ప్రజలకు అవసరమైన రీతిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత నగరపాలక సంస్థ పైన ఉంది. లేనిపక్షంలో యధావిధిగా ఆక్రమణలు కొనసాగి అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంది. పెద్ద పెద్ద రహదారులు సైతం కుంచించుకుపోయి చిన్న చిన్న రహదారులుగా కనిపిస్తున్నాయి. ఈ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ఒక్కసారిగా వర్షపు నీరు రోడ్లపైకి, ఇళ్లలోకి చేరి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన విధంగా స్వచ్ఛ్ ఆంధ్ర లక్ష్యానికి తూట్లు పొడిచే విధంగా ఆక్రమణలు ఉన్నాయి. వీధుల్లో కనిపిస్తున్న అనేక ఆక్రమణలు నగరాభివృద్ధికి దోహదపడక పోగా అవి ఆటంకంగా మారుతున్నాయి. ఇప్పటికైనా పాలకులు మేలుకొని ఆక్రమణలు పూర్తిస్థాయిలో తొలగించాలని అనేకమంది కోరుతున్నారు. ఆక్రమణలు తొలగించి రహదారుల అభివృద్ధిపై నగరపాలక సంస్థ స్పెషల్ ఫోకస్ పెట్టాలని నగరాభివృద్ధిని కాంక్షించే వారు విజ్ఞప్తి చేస్తున్నారు.








