గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 44వ డివిజన్ నాయుడుపేట 5వ లైన్లో సోమవారం పండుగ వాతావరణంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్వయంగా పాల్గొని పెన్షన్ దారులకు నగదు, లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. వినాయక మండపాలను సందర్శించి ఆశీస్సులు పొందిన అనంతరం ప్రజల వద్దకు చేరుకుని కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలితాలు సకాలంలో అందుతున్నాయా, మౌలిక సదుపాయాల కల్పన సంతృప్తికరంగానే ఉందో నేరుగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక సవాళ్లు ఎంత ఉన్నా కూటమి ప్రభుత్వం సాటిలేని సంక్షేమాన్ని అందిస్తోంది” అని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ నగదును రూ.4,000కు పెంచి ప్రతి నెల ఒకటవ తేదీన సమయానికి అందిస్తున్నామన్నారు. ఒకటవ తేదీ రాగానే పెన్షన్ దారుల ముఖాల్లో వెలిగే ఆనందం మా ప్రభుత్వ కర్తవ్య నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. కొన్ని చోట్ల అనర్హులు, బహుళ అంతస్తుల్లో నివసించే వారు కూడా పెన్షన్ పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆర్థికంగా బలమైన వారు స్వచ్ఛందంగా పెన్షన్ రద్దు చేసుకుని బాధ్యతాయుతమైన పౌరులుగా నిలవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా…సెప్టెంబర్ 15 నాటికి స్మార్ట్ రేషన్ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని, క్యూఆర్ కోడ్ సౌకర్యంతో కూడిన ఈ కార్డును స్కాన్ చేయడం ద్వారా లబ్ధిదారుడు సరుకులు తీసుకున్న వివరాలు వెంటనే ప్రభుత్వానికి చేరతాయని, దీంతో పంపిణీలో పూర్తి పారదర్శకత వస్తుందని తెలిపారు. పోర్టబులిటీ విధానం ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే సౌకర్యం కల్పించామని, ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రతి కుటుంబం రేషన్ పొందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.“అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల లబ్ధి చేరాలన్నదే మా కర్తవ్యము. అభివృద్ధి – సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు, పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ ప్రజల ఆదరణతో ముందుకు వెళ్తాం” అని స్పష్టం చేశారు.
232 1 minute read