
జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున అధికారులు హాజరయ్యేలా చర్యలు తీసుకోమని సీఎస్ ను రాయపాటి కోరారు. మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళల రక్షణ, చట్టాలు, భద్రతపై అవగాహన కార్యక్రమాలను సీఎస్ కు ఛైర్ పర్సన్ వివరించారు. జాతీయ మహిళా కమిషన్, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి రాష్ట్రం నుండి అధికారులతో పాటు పోలీసు అధికారులను నామినేట్ చేయాలని సీఎస్ విజయానంద్ కు తెలిపారు. సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు డామన డయూలో జరుగుతున్న జాయింట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి అధికారులు హాజరయ్యేలా జాతీయ మహిళా కమిషన్ చర్యలు తీసుకుంది. మహిళలకు రక్షణ, హక్కులు, భద్రత, చట్టాలు, పథకాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్న జాతీయ మహిళా కమిషన్. లింగ సంబంధిత పరిపాలన, చట్టం అమలులో పౌర, పోలీసు పరిపాలన కలసి పనిచేయడం అవసరం అనే బలమైన సిఫారసుల ఆధారంగా ఈ కార్యక్రమం చేపడుతోంది. ఈ శిక్షణలో పౌర, పోలీసు అధికారుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, మహిళా సంక్షేమ పథకాలు, చట్టాల అమలులో మెరుగుదల, అలాగే భారతీయ న్యాయ సంహిత (BNS) 2023, భారతీయ నగరిక సురక్షా సంహిత (BNSS) 2023 వంటి కొత్త చట్టాలపై ఉన్నతాధికారులకు తాజా పరిజ్ఞానం అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగుతుంది. అదేవిధంగా రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళల రక్షణ, హక్కులు, చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అంశాన్ని సీఎస్ దృష్టికి తెచ్చారు.








