తురకపాలెంలో ప్రభుత్వ వైఫల్యాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పరిశుభ్రమైన నీరు అందకపోవడం, పారిశుద్ధ్యం పడక వేయడం, బెల్టు షాపులు కొనసాగడం లాంటి కారణాలతో గత 3 నెలలుగా 40 మందికి పైగా మరణించారని, వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని జనచైతన్య వేదిక, రేట్ పేయర్స్ అసోసియేషన్, అవగాహన, మానవత, నేస్తం, కోవిడ్ ఫైటర్స్, సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్, మాదిగ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తదితర పౌర సంస్థల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పౌర సంస్థల ప్రతినిధులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీ ఈనెల 6వ తేదీ తురకపాలెం మృతుల కుటుంబాలను పరామర్శించి, మరణాలకు గల కారణాలు తెలుసుకొని, దళిత వాడలోని ప్రజలకు అవగాహన కల్పించారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కులుషిత నీటి సమస్యను పరిష్కరించి, స్వచ్ఛమైన త్రాగునీటిని అందించాలని తురకపాలెంలో పెద్ద ఎత్తున భూగర్భ జలాలను తరలిస్తూ జరిగే నీటి వ్యాపారాన్ని వెంటనే అరికట్టాలని, అనధికారికంగా నడుస్తున్న బెల్టు షాపులను శాశ్వతంగా తొలగించాలని, పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తున్న 6 వేల రూపాయలు వేతనాన్ని 10 వేల రూపాయలకు పెంచి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా చెల్లించాలని కోరారు. తురకపాలెం గ్రామంలో వీధులు, మురుగు కాలువలు శుభ్రం చేయడం, ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించడం లాంటి పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగకపోవడం వలన పారిశుద్ధ్య సమస్యలు ఉత్పన్నమై పలువురి మరణాలకు దారి తీసిందన్నారు. రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణరెడ్డి మాట్లాడుతూ ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రతినెల శుభ్రపరచకపోవడం వలన కూడా నీరు కలుషితమౌతుందని, గుంటూరు నగరంలో సగానికి పైగా ఓవర్ హెడ్ ట్యాంకులను తరచుగా శుభ్రం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్రాంత అడిషనల్ ఎస్.పి. కొణతం వెంకట చలపతిరావు ప్రసంగిస్తూ గత 3 నెలలుగా తురకపాలెంలో మరణాలు సంభవిస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలను కలిసినప్పుడు పంచాయితీ అందిస్తున్న నీరు అప్పుడప్పుడు పురుగులు, పాచితో పచ్చగా వస్తుందని వివరించారన్నారు. నేస్తం సహ వ్యవస్థాపకులు, సామాజిక విశ్లేషకులు టి. ధనుంజయ రెడ్డి ప్రసంగిస్తూ నేటి మరణాలకు బొడ్డు రాయితో ముడిపెట్టి మూఢనమ్మకాలను ప్రోత్సహించవద్దన్నారు. గత ప్రభుత్వం అందించిన నాసిరకపు మద్యమే నేటి మరణాలకు కారణమని కొందరు పేర్కొని చేతులు దులుపుకోవడం తగదన్నారు. మద్యం వ్యసనాన్ని దూరంగా ఉంచితే వారిలో రోగనిరోధక శక్తి పెరిగి త్వరిత గతిన జబ్బుల బారిన పడరన్నారు. మాదిగ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ ఏ.వి. పటేల్ ప్రసంగిస్తూ దళితవాడల్లో మద్యం వ్యసనాన్ని తగ్గించే కృషి జరగాలని, పారిశుద్ధ్యం పెంపుదలకు కృషి జరగాలని కోరారు. మృతుల కుటుంబాల పిల్లలకు విద్యను అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలన్నారు. నేటి మరణాలతో 75 శాతం దళితవాడలోనే జరగడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో అవగాహన నేత రావి వెంకటరత్నం, కోవిడ్ ఫైటర్స్ వ్యవస్థాపకులు అల్లాబక్షు, సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ డా|| టి.సేవ కుమార్ , మానవత కార్యదర్శి కె. సతీష్ తదితరులు ప్రసంగించారు.
234 1 minute read