గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఫిబ్రవరి 3వ తేదీన జరుగుతాయని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రకటిస్తున్నామని చెప్పారు. ఈమేరకు గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ ఓటర్ల లిస్టు 16 వ తేదీ ప్రకటించామని, ఓటర్ల లిస్టు, నోటిఫికేషన్ ను నగర పాలక సంస్థ నోటీసు బోర్డు లో ఏర్పాటు చేయటమైనదన్నారు. ఈ నెల 22 నుండి 24 వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు జియంసి అదనపు కమీషనర్ ఛాంబర్ లో నామినేషన్ లు దాఖలు చేయవచ్చునన్నారు. 24వ తేదీ అందిన నామినేషన్ల ప్రకటన జరుగుతుందని, 27 వ తేదీ ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుందని, అదే రోజు వ్యాలిడ్ నామినేషన్ల ప్రకటన చేయబడుతున్దన్నారు. ఈ నెల 30వ తేదీ మధ్యాన్నం 12 గంటల నుండి 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, అనంతరం తుది పోటీలోని అభ్యర్ధుల ప్రకటన చేయబడుతున్దన్నారు. ఫిబ్రవరి 3 వ తేదీ న ఉదయం 10.30 నుండి 3 గంటల వరకు కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నిక జరుగుతుందని, అదే రోజు 3 గంటల నుండి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జరుగుతుందని కమీషనర్ పులి శ్రీనివాసులు ప్రకటించారు.
147 1 minute read