గుంటూరులో హోల్ సేల్ కూరగాయల మార్కెట్ కోసం దరఖాస్తు చేయకుండానే నగరపాలక సంస్థ నుండి అనుమతులు ఇవ్వడం లేదని అసత్య ప్రచారం చేయడం సరికాదని, నిర్దేశిత విధానం ద్వారా మార్కెట్ ఏర్పాటు కోరుతూ అనుమతుల కోసం దరఖాస్తు చేస్తే వేగంగా ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ కొల్లి శారద హోల్ సేల్ మార్కెట్ లో చట్ట ప్రకారం 25 ఏళ్ల కాల పరిమితి ముగిసిన 81 షాప్ లకు ప్రభుత్వ నిబందనలు మేరకు రోస్టర్ పాటిస్తూ అదనపు కమిషనర్ నేతృత్వంలో 3 రోజులపాటు బహిరంగ వేలం నిర్వహించామన్నారు. గతంలో మార్కెట్ షాప్ ల నుండి ఏడాదికి జిఎంసికి రూ.81 లక్షలు ఆదాయం వచ్చేదని, ప్రస్తుతం వేలం ద్వారా రూ.6 కోట్లు ఆదాయం వస్తుందన్నారు. బహిరంగ వేలానికి ముందే అప్పటికే అక్కడ వ్యాపారం చేస్తున్న వారితో పలు దఫాలు ప్రజా ప్రతినిధుల సమక్షంలో వేలం నిర్వహించాలని, సహకరించాలని కోరగా కొంత గడువు అడిగారని, గడువు ముగిసిన తర్వాత షాప్ లు ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వగా కొందరు కోర్ట్ లో కేసులు దాఖలు చేశారన్నారు. గౌరవ హైకోర్ట్ కూడా కమిషనర్ తో చర్చించుకోవాలని, కమిషనర్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించి కేసులను డిస్పోజ్ చేయడం జరిగిందన్నారు. కాని కొందరి ప్రోద్బలంతో ఇప్పటి వరకు వ్యాపారాలు చేసిన వారు నిబందనలకు విరుద్దంగా, అనధికారికంగా జాతీయ రహదారి సర్వీస్ రోడ్ ని బ్లాక్ చేస్తూ, కనీసం ట్యాక్స్ కట్టని అన్నపూర్ణ కాంప్లెక్స్ ల్లో రైతులను మభ్యపెట్టి కూరగాయల వ్యాపారం చేస్తున్నారన్నారు. వారితో పలు దఫాలు చర్చించి, అనధికారిక మార్కెట్ నిర్వహణ చట్ట వ్యతిరేకమని, దరఖాస్తు చేసుకుంటే వేగంగా ఇతర శాఖల నుండి కూడా అనుమతులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపినామ కనీసం దరఖాస్తు చేయకుండా జిఎంసి అనుమతులు ఇవ్వడం లేదని అసత్య ప్రచారం చేయడం దురదృష్టవకరమని అన్నారు. అసత్య ప్రచారాలు చేసే వారి గత వ్యాపార కాలం చేసిన విధానంపై విచారణ చేస్తే వారు జిఎంసికి చెల్లించే అద్దె కన్నా 3 రెట్లు అదనం అద్దె తీసుకొని నిబందనలకు విరుద్దంగా సబ్ లీజులకు ఇస్తున్నారని, అలాగే షాప్ ల ముందు ఫ్లాట్ ఫారం కూడా రోజుకి ఆకుకూరలు, కూరగాయల విక్రయదారులకు రూ.8 వందలకు రిటైల్ అమ్మకాలకు ఇస్తున్నాని తెలిసిందన్నారు. ఇటువంటి అనధికార అద్దెల ద్వారా నెలకు రూ.40 వేల వరకు వసూళ్లు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. రైతులను మభ్యపెడుతూ, ప్రస్తుతం బహిరంగ వేలంలో షాప్స్ పొందిన వారిని ఇబ్బంది పెడుతూ, అనధికార, చట్ట వ్యతిరేక మార్కెట్ ల ఏర్పాటు ఎందుకని, నిబందనల మేరకు మార్కెట్ ఏర్పాటుకు కావాల్సిన విధానంలో దరఖాస్తు చేసుకుంటే కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ప్రజా ప్రతినిధులు, మేయర్ అవకాశం మేరకు వేగంగా అనుమతులు ఇవ్వాలని సూచించారని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మిషన్ గ్రీన్ గుంటూరు పై మాట్లాడుతూ గుంటూరు నగరం గతంలో ఎన్నడూ లేని విధంగా భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ అవార్డ్ లను అందుకుందని, అందుకు గత ఏడాది కాలంలో నగరంలో తీసుకున్న విప్లవాత్మక చర్యలే కారణమన్నారు. ఈ ఏడాది మిషన్ గ్రీన్ గుంటూరులో భాగంగా దశల వారీగా 5 లక్షలు మొక్కలను నాటాలని సంకల్పించామని, అందుకు అనుగుణంగా ప్రభుత్వ సంస్థ అర్బన్ గ్రీన్ కార్పోరేషన్ ద్వారా నగరంలోని డివైడర్లు, ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటడానికి సర్వే చేసి, టెండర్ ద్వారా మొక్కలను కొనుగోలు చేసామన్నారు. సదరు మొక్కలను ప్రైవేట్ నర్సరీల్లో కూడా విచారణ చేస్తే అందుకు తక్కువ ధరకే గ్రీనింగ్ కార్పోరేషన్ సరఫరా చెస్తుందన్నారు. కొన్ని పత్రికల్లో మొక్కలను టెండర్ లేకుండా కొనుగోలు చేస్తున్నారని ప్రజలను గందరగోళ పరిచే వార్తలు ప్రచురిస్తున్నారని, అటువంటి వార్తలు ప్రచురించే ముందు తమ వివరణ తీసుకుంటే బాగుంటుందన్నారు. లేఅవుట్ రెగ్యులేషన్ స్కీం గూర్చి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనధికార లే అవుట్స్ ని క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం కల్పించిందని, అలాగే ఇటీవల్ క్యాబినెట్ లో అనధికార నిర్మాణాలను కూడా క్రమబద్ధీకరించుకోవడానికి నిర్ణయం తీసుకుందని ఈ సదావకాశంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గడువు అనంతరం అనధికార లే అవుట్స్ కి ప్రభుత్వ సేవలైన విధ్యుత్, త్రాగునీటి సరఫరా, డ్రైనేజి అనుమతులు ఇవ్వడం జరగదని, చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
230 2 minutes read