భారతదేశంలో ప్రతి సంవత్సరం జరిగే మరణాల గణాంకాలను పరిశీలిస్తే ఆందోళన కలిగించే పరిస్థితి బయటపడింది. దేశవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణంగా గుండె సంబంధిత వ్యాధులు నిలుస్తున్నాయని తాజాగా విడుదలైన సాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే మరణాల కారణాల నివేదిక 2021–2023 స్పష్టంచేసింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో జరిగే మొత్తం మరణాల్లో దాదాపు 31 శాతం గుండె సంబంధిత వ్యాధుల వలననే చోటు చేసుకున్నాయని పేర్కొంది. అంటే ప్రతి మూడు మరణాల్లో ఒకటి హృదయ సంబంధిత వ్యాధుల వలననే సంభవిస్తోంది.
ఈ నివేదికలో ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన వారిలో గుండె సంబంధిత సమస్యలు ప్రాణాలను బలిగొడుతున్నాయని పేర్కొన్నారు. ఆధునిక జీవనశైలి, అధిక ఒత్తిడి, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, వ్యాయామం లోపించడం వంటివి గుండె జబ్బుల పెరుగుదలకు దారితీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
15 నుండి 29 ఏళ్ల మధ్య వయస్సు గల యువతలో ప్రధాన మరణ కారణం ఆత్మహత్యలేనని నివేదికలో ప్రస్తావించారు. కానీ 30 ఏళ్లు దాటిన తర్వాత మాత్రం గుండె సంబంధిత వ్యాధులే ముందంజలో ఉన్నాయని సమాచారం వెల్లడించింది. ఈ వాస్తవం సమాజానికి పెద్ద హెచ్చరికగా పరిగణించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.
నివేదిక ప్రకారం అసంక్రమ వ్యాధులు మొత్తం మరణాల్లో 56.7 శాతం వాటా కలిగి ఉన్నాయి. వీటిలో ప్రధానంగా గుండె సంబంధిత వ్యాధులు 31 శాతం, క్యాన్సర్లు 6.4 శాతం, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు 5.7 శాతం, మధుమేహం, మూత్రపిండ వ్యాధులు, నాడీ సంబంధిత సమస్యలు కూడా గణనీయంగా ఉన్నాయని వెల్లడించారు.
అసంక్రమ వ్యాధుల ఆధిపత్యం పెరుగుతున్నా సంక్రమ వ్యాధులు, ప్రసూతి సమస్యలు, పోషక లోపాలు, పిల్లల వ్యాధులు కలిపి 23.4 శాతం మరణాలకు కారణమవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు 9.3 శాతం మరణాలకు కారణమవుతున్నాయని నివేదిక పేర్కొంది.
వైద్య నిపుణులు చెబుతున్నట్లుగా గుండె సమస్యలు పెరగడానికి ప్రధాన కారణాలు వ్యాయామం చేయకపోవడం, అధిక ఒత్తిడి, మానసిక ఉద్వేగాలు, అధిక కొవ్వు ఉప్పు నూనె కలిగిన ఆహారం తీసుకోవడం, పొగ త్రాగడం, మద్యపానం, అధిక బరువు, మధుమేహం, రక్తపోటు నియంత్రణలో లేకపోవడం వంటివి. ఈ కారణాల వలన యువతలో కూడా గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
వైద్యులు సూచించిన నివారణ చర్యల్లో ప్రతిరోజూ కనీసం అరగంట వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం, పొగ త్రాగడం మద్యం మానేయడం, రక్తపోటు మధుమేహం కొలెస్ట్రాల్ పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవడం, ఒత్తిడి తగ్గించే అలవాట్లు అలవరచుకోవడం ఉన్నాయి. ఈ చర్యలు తీసుకుంటే గుండె సమస్యలను నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ప్రభుత్వం స్థాయిలో కూడా పెద్ద ఎత్తున చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. గ్రామీణ స్థాయి వరకు గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, హెల్త్ స్క్రీనింగ్ శిబిరాలు, ప్రాథమిక ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని అభిప్రాయపడ్డారు. ప్రజల్లో జీవనశైలి మార్పుల అవసరంపై అవగాహన పెంచడం తప్పనిసరిగా మారిందని తెలిపారు.
ప్రతి సంవత్సరం లక్షలాది మంది గుండె సంబంధిత వ్యాధుల కారణంగా మృతిచెందుతున్నారు. ఔషధ వినియోగం కూడా విపరీతంగా పెరుగుతోంది. మధుమేహం, రక్తపోటు కేసులు గత దశాబ్దంతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇది కేవలం వైద్య రంగానికే కాకుండా సమాజానికీ ఒక పెద్ద సవాల్‌గా మారింది.
ఈ నివేదిక కేవలం గణాంకాలు మాత్రమే కాదు సమాజానికి ఒక హెచ్చరిక కూడా. గుండె సమస్యలు కేవలం వృద్ధులకే పరిమితం కాకుండా యువతలో కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ప్రభుత్వం, వైద్యులు, సమాజం కలిసి పనిచేసినప్పుడే ఈ భయానక పరిస్థితిని తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు.