రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అన్ని జిల్లాల్లోనూ ఎరువులు సమృద్ధిగా సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. పంపిణీలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలని అధికారులకు సీఎం సూచనలు జారీ చేశారు. సోమవారం ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో ఎరువుల సరఫరా, ఉల్లి కొనుగోళ్లు, తురకపాలెం గ్రామంలో ఆరోగ్య పరిస్థితులు, కాఫీ పంటలకు సోకిన తెగులు తదితర అంశాలపై సుదీర్ఘంగా మూడు గంటలపాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రైతులకు ఎక్కడా యూరియా సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. మరో పది రోజుల్లో 23,592 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తుందని అన్నారు. ఆర్టీజీఎస్ నుంచి అధికారులతో సమీక్ష నిర్వహిస్తూనే రాష్ట్రానికి మరింత ఎరువుల కేటాయింపుపై కేంద్రమంత్రి జేపీ నడ్డాతో ముఖ్యమంత్రి ఫోన్‌లో మాట్లాడారు. ఇవాళ కాకినాడ తీరానికి చేరుకున్న నౌకలోని 7 రేక్‌ల యూరియాను ఏపీకి కేటాయించాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి తక్షణమే రాష్ట్రానికి ఆ యూరియాను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రానికి అదనంగా మరో 50 వేల మెట్రిక్ టన్నుల కేటాయించినట్లైంది. వచ్చే రబీ సీజన్‌కు ఇప్పటి నుంచే యూరియా సరఫరా ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులకు ఎరువుల పంపిణీకి సంబంధించి భరోసా ఇవ్వాలని సూచించారు. అలాగే రైతులు, కౌలు రైతులు ఎరువులు దొరకవనే ఆందోళనతో ఒకేసారి కొనుగోలు చేయకుండా.. నిల్వచేసి పెట్టుకోకుండా చూడాలని సీఎం పేర్కొన్నారు. అలాగే అనవసరపు కోనుగోళ్లపైనా దృష్టి పెట్టాలని సీఎం పేర్కొన్నారు. నిత్యావసర సరకుల జాబితాలో ఉన్న ఎరువులను బ్లాక్ మార్కెటింగ్ చేయకుండా నియంత్రించాలని సీఎం స్పష్టం చేశారు. కొందరు కావాలనే రాజకీయ దురుద్దేశాలతో చేస్తున్న ప్రయత్నాలను నిలువరించాలని సూచించారు. శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు జరుగుతున్న ఈ తరహా ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. అధిక మోతాదులో ఎరువుల వినియోగంపై రైతులను చైతన్య పరిచేలా కార్యక్రమాలను, ప్రచారాన్ని నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎరువుల వినియోగాన్ని తగ్గించిన రైతులకు ప్రోత్సాహకంగా సబ్సీడీని రైతుల ఖాతాల్లోకి జమ చేసే పథకంపైనా దృష్టి పెట్టి విస్తృత ప్రచారం చేయాలన్నారు.
1,229 1 minute read