తాడికొండ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో సురక్షితమైన తాగునీరు సరఫరాకు జల్ జీవన్ మిషన్ ద్వారా మంజూరు చేసిన పనులను సత్వరమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి గ్రామీణ నీటి సరఫరా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, తాడికొండ నియోజకవర్గ శాసన సభ్యులు తెనాలి శ్రావణ కుమార్ తో కలిసి తాడికొండ నియోజకవర్గ పరిధిలో జల జీవన్ మిషన్, ఇతర పథకాల ద్వారా మంజూరు చేసిన త్రాగునీటి సరఫరా పనులపై గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు, పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. తాడికొండ నియోజకవర్గ పరిధిలోని తాడికొండ, ఫిరంగిపురం, మేడికొండూరు తుళ్లూరు మండలాల్లో జల్ జీవన్ మిషన్ ద్వారా జరుగుతున్న నీటి సరఫరా పంపిణీ పైపులైను, నీటి వనరుల పెంపుదల, ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు మరమ్మత్తు పనులపై పురోగతిపై గ్రామాల వారీగా అధికారులతో సమీక్షించి, పనులు వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ సూచనలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు లేకుండా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలన్నారు. మంచినీటి సరఫరా మెరుగుదలకు సంబంధించి అవసరమైన చిన్న , మధ్యతరహా పనులకు ప్రతిపాదనలు వారం రోజుల్లో తయారుచేసి అందిస్తే అనుమతులు మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. పెద్ద పనులకు సంబంధించి రెండు వారాల్లో ప్రతిపాదన సిద్ధం చేసి రాష్ట్రస్థాయిలో అనుమతులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు 70 నుంచి 80 శాతం పూర్తయిన వాటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పూర్తి అయ్యేలా ఆర్ డబ్ల్యు ఎస్ ఇంజనీరింగ్ ఆధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.
233 1 minute read