వినాయకుడు, లేదా గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు
వినాయకుడు, లేదా గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు హిందూ దేవులలో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు.[4] ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవుడు స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్– టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.[5] హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా, వాటితో సంబంధం లేకుండా అందరూ గణపతిని ఆరాధించడం కద్దు.[6] గణేశుడి పట్ల భక్తి జైన, బౌద్ధమతాల్లోకి కూడా విస్తృతంగా వ్యాపించింది.[7] గణేశుని అనేక విశేషణాలతో వర్ణించినప్పటికీ ఏనుగు ముఖం వల్ల ఆయనను సులభంగా గుర్తించవచ్చు.[8] గణేశుడిని ఆటంకాలను తొలగించేవాడిగా (విఘ్నేశ్వరుడు),[9] కళలకు, శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా[10] భావించి పూజలు చేస్తుంటారు. పనులు ప్రారంభించేటపుడు కృతువుల్లో, పూజల్లో ప్రథమ పూజ గణపతికి చేస్తుంటారు. మానవ జీవితంలో విద్య ప్రారంభ సమయంలో చేసే అక్షరాభ్యాసంలో కూడా గణపతిని పూజిస్తారు.[11][3] ఆయన పుట్టుక, లీలల గురించి అనేక పౌరాణిక గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి.