
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వలన ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ నగర కార్యదర్శి, ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ తెలిపారు. కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆటో డ్రైవర్లు తమ కుటుంబాల పోషణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్త్రీ శక్తి పేరుతో సభలు నిర్వహిస్తున్న నేతలు ఆటో కార్మికుల జీవన స్థితిగతుల గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ఆటో కార్మికులకు ఉపశమన చర్యలు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు మంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆటో డ్రైవర్లు రుణభారం, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతోనే ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇక ఉచిత బస్సు సౌకర్యం వలన ప్రయాణికులు తగ్గిపోవడంతో వారి పరిస్థితి మరింత దారుణంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈనెల 15న కలెక్టర్ కార్యాలయం వద్ద జరగబోయే ధర్నాలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయాలని ఇద్దరు నేతలు పిలుపునిచ్చారు. ఈ ధర్నా విజయవంతం చేస్తే మాత్రమే ప్రభుత్వం గమనించి చర్యలు తీసుకునే అవకాశముందని వారు అభిప్రాయపడ్డారు. ఈ ఆటో యూనియన్ నగర అధ్యక్షుడు కూరాకుల రాంప్రసాద్, సహాయ కార్యదర్శి ఎం డి బాబర్ పాల్గొన్నారు.








