ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్ టి. లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.ఈమేరకు జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులో ఆంధ్రప్రదేశ్ లో నీటిపారుదల ప్రాజెక్టులు – ప్రస్తుత పరిస్థితి అనే అంశంపై జరిగిన చర్చా గోష్టి జరిగింది. లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల జాబితాలో కరువు పీడిత రాయలసీమ ప్రాంతంలోని హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ, ప్రకాశం జిల్లాలోని వెలుగొండ, వెనుకబడిన ఉత్తరాంధ్రలోని వంశధార రెండవ దశ, తోటపల్లి బ్యారేజీ, వంశధార నాగవల్లి అనుసంధాన పథకం, ఉత్తరాంధ్ర సృజల స్రవంతి ప్రాజెక్టులకు అవసరమైన నిధులను కేటాయించి నిర్మాణం చేయుట ద్వారా దాదాపు 40 లక్షల ఎకరాలు సాగుదలకు వస్తుందని చెప్పారు. దీనికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ప్రారంభించడం హర్షదాయకమన్నారు. బహుళార్థ సాధక ప్రాజెక్టు అయిన పోలవరాన్ని 150 అడుగుల ఎత్తులో నిర్మించి, గరిష్ట స్థాయిలో నీటిని నింపినప్పుడే ప్రాజెక్ట్ నిర్దేశిత లక్ష్యాలు నెరవేరుతాయి అన్నారు. ఈ చర్చా గోస్టిలో జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, ప్రొఫెసర్ డి ఏ ఆర్ సుబ్రహ్మణ్యం, ఉమ్మడి గుంటూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కల్లూరి శ్రీనివాసరావు, హైకోర్టు అడ్వకేట్ నర్రా శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు ఏవి పటేల్, నేస్తం సహ వ్యవస్థాపకులు టి. ధనుంజయ రెడ్డి పాల్గొన్నారు.
240 1 minute read