మచిలీపట్నం: సెప్టెంబరు 13, 2025:మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేసి 2026 అక్టోబర్ లో పోర్టు రవాణ కార్యకలాపాలు ప్రారంభిస్తామని రాష్ట్ర రవాణ రహదారులు భవనాల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు పేర్కొన్నారు.శనివారం ఉదయం ఆయన అధికారులతో కలిసి మచిలీపట్నం పోర్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. నార్త్, సౌత్ బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్, బెర్తులు, రహదారులు, పరిపాలన భవనాలు, గిడ్డంగుల నిర్మాణాలు తదితర పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏపీ మారిటైం బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్యతో కలిసి పరిపాలన భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆయన ఇప్పటి వరకు ఆయా పనుల పురోగతి ఎంత వరకు పూర్తయ్యాయనే దానిపై సమీక్షించారు. పెద్ద మొత్తంలో యంత్రాలు, మ్యాన్ పవర్ పెంచి నిర్దేశించిన సమయానికి పోర్టు పనులను పూర్తిచేయాలని ఆయన ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ.5,500 కోట్ల వ్యయంతో చేపట్టిన మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేసి 2026 అక్టోబర్ కల్లా పోర్టు రవాణా కార్యకలాపాలను ప్రారంభించాలనే కృత నిశ్చయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారని పేర్కొన్నారు. మచిలీపట్నం పోర్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాలను తీర్చడంతో పాటు సమీపంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర అవసరాలు కూడా తీరుతాయని అన్నారు. ప్రణాళికలో భాగంగా మొత్తం 16 బెర్తులను ఏర్పాటు చేస్తున్నామని, మొదటి దశగా నాలుగు బెర్తులను అనుకున్న సమయానికి పూర్తి చేసి కార్యకలాపాలను ప్రారంభిస్తామని, మిగిలిన బెర్తుల నిర్మాణ పనులను కొనసాగిస్తామని, ప్రస్తుతానికి 50 శాతం మేర పనులు పూర్తయినట్లు ఆయన తెలిపారు. త్వరలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు కానున్న నేపథ్యంలో హైదరాబాదు మార్గంతో పాటు పోర్టుకు సమీపంలోని జాతీయ రహదారులు, రైలు రవాణా మార్గాలను అభివృద్ధి చేస్తామని, అందుకు సంబంధించిన డిపిఆర్ లను(డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్) ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిపారు.అదేవిధంగా గిలకలదిండిలోని ఫిషింగ్ హార్బర్ పనులు కొంతమేర నెమ్మదించాయని, వాటిని కూడా వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని, త్వరలోనే మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు.ఈ పర్యటనలో మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ తులసీదాస్, జాయింట్ సి ఎఫ్ ఓ సతీష్, ఏపీ మారిటైమ్ బోర్డు సిఈ రాఘవరావు, రైట్స్ టీం లీడర్ విశ్వనాథం, ఇన్చార్జి డిఆర్ఓ, కేఆర్ఆర్సీ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్, ప్రజా రవాణా అధికారి వెంకటేశ్వరులు, మచిలీపట్నం నార్త్ మండలం తహసిల్దార్ నాగభూషణం తదితర అధికారులు పాల్గొన్నారు.
………………………………….
1,233 1 minute read