Guntur News: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం – ఎమ్మెల్యే మాధవి
Development Activities in Guntur
సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నదని, దీనికి ఎన్డీయే కూటమి నేతలు ఎనలేని కృషి చేస్తున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. సోమవారం 25, 39వ డివిజన్ లలో మొత్తం రూ.2 కోట్ల 2 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పనులు ఎన్ని రోజుల్లో పూర్తి చేసి, ప్రజలకి అందుబాటులోకి తీసుకొని వస్తారని అధికారులను, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా డివిజన్లలో అసంపూర్తిగా నిలిచిన పనులు ఉన్నాయా ? ఎక్కడెక్కడ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం అవసరం అవుతుందో గుర్తించి, తన దృష్టికి తీసుకొనివచ్చి, అవసరమయిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే గళ్ళా మాధవి మీడియాతో మాట్లాడుతూ… గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చామని చెప్పారు. తన దృష్టి మొత్తం నియోజకవర్గ అభివృద్ధి మీదనే పెట్టానని, తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించటమే తన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం శివారు కాలనీలను నిర్లక్ష్యం చేసిందని, వర్షాకాలం వస్తే ఇక్కడి ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, సిసి రోడ్లు, డ్రైన్ల ఎత్తు పెంచి ఈ కాలనీలను ముంపు గురి కాకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామినిచ్చారు. అనంతరం జోసెఫ్ నగర్ లో ఉన్న ప్రభుత్వ స్కూల్ ను సందర్శించారు, కనీస సదుపాయాలు లేక విద్యారులు ఇబ్బందులకు గురవుతున్నారని, వీటన్నిటిని విద్యాశాఖ దృష్టికి తీసుకొని వెళ్లి సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.