Guntur News: రహదారుల విస్తరణ పనులను వేగవంతం చేయాలి
Guntur Commissioner Fire On Officials
గుంటూరులోని ఏటి అగ్రహారం విస్తరణ పనులు వేగంగా చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. విస్తరణ పూర్తి అయిన ప్రాంతంలో రోడ్ నిర్మాణ పనులను తక్షణం ప్రారంభించాలని పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కమిషనర్ ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ విస్తరణ పనులను పరిశీలించారు. అదేవిధంగా పట్టాభిపురం మస్టర్ పాయింట్, దుర్గా నగర్ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత చుట్టగుంట సెంటర్ నుండి కంకరగుంట ఆర్యుబి వరకు చేపట్టిన ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ విస్తరణ పనులను పరిశీలించారు. రహదారి విస్తరణ పనుల జాప్యం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికే పలు ఫిర్యాదులు అందిన పనులు వేగంవతం చేయకపోవడంతో ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి నెలాఖరులోపు రోడ్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లు కూడా పనుల్లో జాప్యం లేకుండా చేయాలన్నారు. పట్టాభిపురం ప్రజారోగ్య విభాగ మస్టర్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేసి, కార్మికుల, కార్యదర్శుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. మెరుగైన పారిశుధ్యం చేపట్టడానికి ఇన్స్పెక్టర్ల వారీగా ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేసుకోవాలని, అందుకు తగిన మౌలిక పనిముట్లను అందిస్తామని తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా సెలవులు తీసుకోవడానికి వీలులేదని, ప్రతి సెలవు రిజిస్టర్ లో నమోదు చేయాలని ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. నగరంలో ప్రధాన రహదారులపై ఆవులు ఉండడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని, వార్డ్ ల వారీగా ఆవులను పట్టుకొని, జిఎంసి గోశాలకు తరలించాలని ఎంహెచ్ఓని ఆదేశించారు. అనంతరం దుర్గా నగర్ లో బీహార్, శ్రీకాకుళం నుండి కార్మికులను తీసుకొచ్చి, వారికి కనీస మౌలిక వసతులు కల్పించకుండా రేకుల షెడ్లలో అధిక సంఖ్యలో ఉంచడం గమనించారు. తక్షణం ఆయా షెడ్ ల నిర్వహకులకు నోటీసులు జారీ చేసి, నిబందనల మేరకు అనుమతి తీసుకోకుండా నిర్మాణం చేసిన వాటిని తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు.