గుంటూరు నగరంలో డ్రైనేజి వ్యవస్థకు అడ్డుగా ఉన్నఆక్రమణలను యుద్దప్రాతిపదికన తొలగించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కమిషనర్ ఐటిసి వెల్కం హోటల్ పరిసరాలు, విద్యా నగర్, జిఎంసి ప్రధాన కార్యాలయం, కొత్తపేట జంక్షన్, కూరగాయల మార్కెట్ తదితర ప్రాంతాల్లో అవుట్ ఫాల్ డ్రైన్లను, రోడ్ల పక్కన ఆక్రమణలను పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షం నీరు డ్రైన్లలోకి వెళ్లడానికి వీలు లేకుండా నిర్మాణం చేసిన ఆక్రమణలను యుద్దప్రాతిపదికన తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టం చేశారు. ఇప్పటికే ఏఈల వారీగా అవసరమైన ప్రాంతాల్లో ప్రైవేట్ గా ఆయిల్ ఇంజిన్లను ఏర్పాటు చేసుకొని నీటిని బెయిల్ అవుట్ చేయాలని తెలిపామని, అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నీటి నిల్వపై ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. డిఈఈలు వర్షం నీటి బెయిల్ అవుట్ పై ద్రుష్టి సారించాలన్నారు. నవభారత్ నగర్ మెయిన్ రోడ్ నుండి గుజ్జనగుండ్ల శేషయ్య హాస్పిటల్ వరకు రోడ్ మీద నుండి నీరు డ్రైన్ లోకి వెళ్లడానికి ఒక అడుగు వెడల్పుతో వెంట్ లు ఏర్పాటు చేయాలని డిఈఈని ఆదేశించారు. ప్రస్తుత వాతావరణ పరిస్తుతుల దృష్ట్యా పనులను వేగంగా పూర్తీ చేయాలన్నారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా జిఎంసి చేపడుతున్న చర్యలకు నగర ప్రజలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈ పర్యటనలో ఈఈ కోటేశ్వరరావు, డిఈఈ రమేష్ బాబు, కార్పొరేటర్ వేములపల్లి శ్రీరాం ప్రసాద్, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
230 1 minute read