విజయవాడ 15 -09-2025:సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్య విధానమే ఆయుర్వేద ఔషద సేవనమని ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిర్మలా జ్యోతి బాయి అన్నారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవంను పురష్కరించుకుని ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ నగర వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రన్సిపాల్ నిర్మలా జ్యోతి బాయి మాట్లాడుతూ నేటి స్పీడ్ యుగంలో ముఖ్యంగా యువత విపరీతమైన వత్తిడికి గురవుతున్నారని, వారి వత్తిడిని సహజ పద్ధతిలో తొలగించి ప్రశాంత జీవనం సాగించే వైద్యం ఆయుర్వేదంలో ఉందన్నారు. తక్కువ ఖర్చుతో ప్రాణాంతకమైన, దీర్ఘకాల వ్యాధులను సైతం సులువుగా తగ్గించే విధానం ఆయుర్వేద వైద్య ప్రత్యేకత అని తెలిపారు. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే వన మూలికల తో వ్యాధులను నయం చేసే ప్రక్రియే ఆయుర్వేదమని అన్నారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 23న జాతీయ ఆయుర్వేద దినోత్సవం ను ఘనంగా జరుపుకుంటామని వివరించారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో భాగంగా సోమవారం నుండి ఈ నెల 23 వరకు రోజూ వినూత్న కార్యక్రమాలు నిర్వహించి ఆయుర్వేద చికిత్సపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నామన్నారు. ఇందులో భాగంగా మంగళవారం కృష్ణ లంకలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నామని, కళాశాల ఆవరణలో ఆయుర్వేదంపై అవగాహన పెంచేలా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేస్తామన్నారు. ఈ నెల 23న కళాశాల ఆవరణలో ధన్వంతరీ హోమం, పూజాధికార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
1,236 1 minute read