గుంటూరు, సెప్టెంబర్ 17 : చేతివృత్తుల కళాకారులైన విశ్వకర్మల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతతో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ ఎ తమీమ్ అన్సారియా తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలలో జిల్లా కలెక్టర్ పాల్గొని విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విరాట్ విశ్వకర్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వ పండగగా ప్రకటించిందన్నారు.విశ్వకర్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. చేతి వృత్తి కళాకారుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అవసరమైన అన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో స్వర్ణాంధ్ర 2047 విజన్ యాక్షన్ ప్లాన్ లో జిడిపికి సంబంధించి ఎకనామిక్ గ్రోత్ తరువాత, రెండవ ప్రాధాన్యత అంశంగా సంక్షేమ కార్యక్రమాలపై పూర్తిస్థాయిలో సమీక్షించడం జరిగిందన్నారు. అన్ని కులాల సంక్షేమం, అభివృద్ధికి కోసం ప్రవేశపెట్టిన అన్ని పథకాలు పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారన్నారు. జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలు ఎక్కువ మందికి లబ్ధి అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. చేతి వృత్తి కళాకారులు అవసరమైన నైపుణ్యాల కోసం ప్రభుత్వం రూపొందించిన నైపుణ్యం వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేసుకుంటే వారికి పూర్తిస్థాయిలో నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడంతో పాటు మంచి ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వెనుకబడిన తరగతులు, చేతి వృత్తి కళాకారులు అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలపై అందించే సూచనలపై జిల్లా యంత్రాంగం సానుకూల దృక్పథంతో స్పందించి వాటిని అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు .ఏపీ విశ్వబ్రాహ్మణ సంఘం సమన్వయ కమిటీ చైర్మన్ ఎం వెంకట ప్రసాద్, గుంటూరు టిడిపి బీసీ సెల్ అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్, గుంటూరు పార్లమెంటరీ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు జంపని నాగేశ్వరరావు మాట్లాడుతూ మహాభారతంలో మయసభను నిర్మించిన దేవశిల్పి అన్నారు. విశ్వకర్మ పరమాత్మ సృష్టికి పూర్వమే ఐదు ముఖాలతో, పది చేతులతో స్వయంభూగా అవతరించారన్నారు. ఆయన స్ఫూర్తితోనే నేడు ఎంత అద్భుతమైన నిర్మాణాలు చేస్తున్నారన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతి వృత్తి కళాకారులైన విశ్వకర్మలకు అధిక ప్రాధాన్యతిస్తూ విరాట్ విశ్వకర్మ జయంతిని ప్రభుత్వ పండగగా ప్రకటించటం సంతోషంగా ఉందన్నారు. పౌరోహిత్యంతో పాటు ఐదు రకాల చేతివృత్తులు చేసే విశ్వకర్మలు సమాజ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తూన్నారన్నారు. యాంత్రికరణ నేపథ్యంలో చేతి వృత్తులపై ఆధారపడిన విశ్వకర్మలు కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం విశ్వకర్మలకు నైపుణ్య శిక్షణతో పాటు స్వయం ఉపాధి పథకాలకు బీసీ కార్పొరేషన్ ద్వారా విరివిగా ఆర్థిక సాయం అందించాలన్నరు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజవలి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి మయూరి, బీసీ సంక్షేమ సంఘాలు, విశ్వకర్మ సంక్షేమ సంఘాల నాయకులు, ప్రతినిధులు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.
207 1 minute read