గుంటూరు, సెప్టెంబర్ 17 : జిల్లాలో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంను కేంద్ర
కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ గుంటూరు వైద్య కళాశాలలో బుధవారం ప్రారంభించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మ దినోత్సవం సందర్భంగా కార్యక్రమం ప్రారంబించడం సంతోషదాయకం అన్నారు. దేశ స్థితిగతులు మార్చిన వ్యక్తి ప్రధాన మంత్రి అన్నారు. ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా నిలబెట్టుటకు, యు.పి.ఐ, టెలి కమ్యూనికేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని చెప్పారు. 30 కోట్ల సెల్ ఫోన్లు దేశంలో తయారు చేసి ఎగుమతులు చేసే పరిస్థితి ఉందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో జాతీయ రహదారులు, విమానాశ్రయాలు ఉన్నాయన్నారు. “మహిళ ఆరోగ్యం – జాతీయ ఆరోగ్యం” అని ఆలోచించి ” స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్” ప్రారంభించారన్నారు. ఆరోగ్యవంతమైన మహిళ – శక్తి వంతమైన, ఆరోగ్యవంతమైన కుటుంబానికి నిలయంగా ఉంటుందన్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రుల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద జిల్లాలో ఇప్పటి వరకు 8.60 లక్షల మంది నమోదు అయ్యారని, శత శాతం నమోదు అయి సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.శాసన సభ్యులు నషీర్ అహ్మద్ మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం బాగుంటే సమాజ ఆరోగ్యం బాగుంటుందన్నారు. ప్రధాన మంత్రి అనేక కార్యక్రమాలు చేపట్టడం ముదావహం అన్నారు.జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్అన్సారియా మాట్లాడుతూ స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వైద్య, అవగాహన శిబిరాలలో మహిళలు, బాలికలకు రక్త హీనత, క్షయ, సికిల్ సెల్ అనీమియా గుర్తింపు పరీక్షలు, బిపి, మధుమేహం, క్యాన్సర్ వంటి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. పిల్లలకు టీకాలు వేయడం జరుగుతుందని అన్నారు. మహిళలు, కౌమార దశలో ఉన్న బాలికలకు రుతుక్రమ పరిశుభ్రత, పౌష్టికాహార సమాచారం, అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రధాన మంత్రి వందన యోజనలో ప్రత్యేక నమోదు చేపట్టడం జరుగుతోందని వివరించారు.ఏ పి.ఎం.ఎస్.ఐ.డి.సి మేనేజింగ్ డైరెక్టర్ గిరీషా మాట్లాడుతూ రాష్ట్రంలో 13 వేల వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని, ప్రదర్శన శాలలను సందర్శించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కృష్టియానా, డిప్యూటీ మేయర్ షేక్ సజీల, సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ వి.హరిబాబు నాయుడు,వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.సుందరాచారి, తులసి సీడ్స్ అధినేత రామచంద్ర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి, గుంటూరు సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్.ఎస్.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.
206 1 minute read