డా. పి. విజయ జపాన్ కాన్ఫరెన్స్ 2025లో భారతదేశ ప్రతినిధిగా పాల్గొని ప్రపంచ వేదికపై భారత్ గౌరవాన్ని నిలబెట్టారు.
జపాన్లోని కోబే నగరంలో సెప్టెంబర్ 12 నుండి 15 వరకు జరిగిన ప్రతిష్టాత్మక ఆసియా పసిఫిక్ స్ట్రోక్ కాన్ఫరెన్స్ – 2025లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, లలితా హాస్పిటల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డా. పి. విజయ పాల్గొనడం విశేషం. ఈ విజయంపై గుంటూరు లలితా హాస్పిటల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడింది.
జపాన్ లో ప్రాతినిధ్యం వహించిన ఆమె, స్ట్రోక్ అవగాహన, నివారణ, చికిత్స, పునరావాసం వంటి అంశాలపై ప్రత్యేక ప్రసంగం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల నుంచి శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు పాల్గొన్న ఈ సదస్సులో, ఆధునిక చికిత్సా విధానాలు, టెలీమెడిసిన్, కృత్రిమ మేధస్సు ఆధారిత నిర్ధారణ పద్ధతులు, క్లాట్ బస్టర్ ఔషధాల వినియోగంపై విస్తృతంగా చర్చలు జరిగాయి.
డా. పి. విజయ జపాన్ కాన్ఫరెన్స్లో ప్రసంగిస్తూ… భారత్లో స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తక్షణ వైద్యసదుపాయాల కొరత కారణంగా మరణాలు అధికంగా ఉన్నాయని గుర్తు చేశారు. “స్ట్రోక్ గోల్డెన్ అవర్లో సరైన చికిత్స అందితే ప్రాణాలు కాపాడవచ్చు. అందుకే టెలీమెడిసిన్, అవగాహన కార్యక్రమాలు అత్యవసరం” అని ఆమె అన్నారు.
ఈ కాన్ఫరెన్స్ ద్వారా భారత్కు రెండు ప్రధాన ప్రయోజనాలు లభించాయని ఆమె వివరించారు. ఒకవైపు అంతర్జాతీయ నిపుణులతో నెట్వర్క్ ఏర్పడి సంయుక్త పరిశోధనలకు మార్గం సుగమమైందని, మరోవైపు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో అధునాతన చికిత్స అందించే మార్గదర్శకాలు లభించాయని తెలిపారు.
మహిళల ఆరోగ్య సమస్యలపైనా ఈ సదస్సులో చర్చ జరిగింది. గర్భధారణలో వచ్చే క్లిష్టతలు, మెనోపాజ్ తర్వాత స్ట్రోక్ అవకాశాలు, పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), హార్మోనల్ సమస్యలు వంటి అంశాలపై అంతర్జాతీయ నిపుణులు విశ్లేషణలు జరిపారని డా. విజయ పేర్కొన్నారు.
ఆమె మాట్లాడుతూ, “ఇలాంటి వేదికలు కేవలం వైద్య రంగానికే కాకుండా, ప్రజల ఆరోగ్య రక్షణకు దోహదపడతాయి. భారత్లో స్ట్రోక్ అవగాహన ఇంకా తక్కువగా ఉంది. ఈ విషయంలో వైద్యులు మాత్రమే కాకుండా మీడియా కూడా భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు.
భారత్ తరపున ఈ అంతర్జాతీయ వేదికపై ప్రసంగించడం గర్వకారణమని డా. విజయ పేర్కొన్నారు. భవిష్యత్తులో భారత వైద్య రంగం మరింత అంతర్జాతీయ స్థాయిలో ముందుకు సాగేందుకు పరిశోధన ప్రాజెక్టులు చేపట్టాలని సంకల్పం వ్యక్తం చేశారు.
.World Stroke Organization (WSO) – https://www.world-stroke.org
(Global authority on stroke awareness and prevention)