విజయవాడ, సెప్టెంబర్ 19, 2025 తన రచనల ద్వారా సమాజ రుగ్మతులను ఎత్తిచూపిన మహాకవి, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ బోయి భీమన్న ప్రాతఃస్మరణీయులని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడ కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ అధ్యక్షతన నిర్వహించిన డాక్టర్ బోయి భీమన్న 114వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ…. నేడు మనం మానవ హక్కులు, దళిత హక్కుల గురించి మాట్లాడుతున్నామని.. అయితే అస్పృశ్యత తీవ్రంగా ఉన్న రోజుల్లోనే వీటి గురించి బోయి భీమన్న ప్రస్తావించడం గొప్ప విషయం అని అన్నారు. ఆయన నికార్సైన జాతీయవాదని చెప్పారు. ఆనాడు ఎదురవుతున్న సమస్యలను, విద్యను అభ్యసించడానికి ఉన్న ఇబ్బందులను తెలుపుతూ “జానపదుల జాబులు” అనే రచన చేశారని చెప్పారు. కుల,మత, వర్గ విభేదరహితమైన భారతజాతి ఆవిర్భావించాలనేదే తన ధ్యేయమని ప్రకటించిన భీమన్నది మహోన్నత వ్యక్తిత్వం అని, ఆయన మాట, బాట అందరికీ అనుసరణీయమని అన్నారు. ఆయన రచించిన”జయ జయ జయహే అంబేద్కర్” గీతం దళితులకు జాతీయ గీతంగా మారిందన్నారు.ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు ఆరు పర్యాయాలు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన, “తెలుగే ప్రాచీనం”,”తెలుగు కోసం” వంటి పరిశోధన గ్రంథాలతో పాటు సాహిత్య, వైజ్ఞానిక రచనలు, 150 కి పైగా రచనలు చేసిన డాక్టర్ జీవీ పూర్ణచందుకు బోయ భీమన్న పురస్కారం ఇవ్వడం భీమన్న గారికి సరైన నివాళి అని చెప్పారు. భీమన్న వ్యక్తిత్వాన్ని, జీవన గమనాన్ని ఆకళింపు చేసుకొని ఆయన సతీమణి బోయి హైమావతి ” పాలేరు నుంచి పద్మశ్రీ వరకు” అనే రచన చేశారని చెప్పారు. సమాజ హితానికి కృషిచేసిన వ్యక్తుల వైశిష్ఠ్యాన్ని తెలిపే కార్యక్రమాలు నిర్వహిస్తున్న భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్. మల్లికార్జునరావును అభినందించారు.చెరుకుపల్లి లో గండపెండెరంబోయి భీమన్న సతీమణి సుప్రసిద్ధ రచయిత్రి బోయి హైమావతి మాట్లాడుతూ… భీమన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పగటి దివిటీల వెలుగులో బోయి భీమన్నకు నాటి గుంటూరు జిల్లా (ప్రస్తుత బాపట్ల జిల్లా) చెరుకుపల్లిలో గండపెండెరం తొడిగారని చెప్పారు. నాటి సభ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అధ్యక్షతన జరిగిందని గుర్తు చేసుకున్నారు.వైద్యులు, శతాధిక గ్రంథకర్త డాక్టర్ జీవి పూర్ణ చంద్ ను ఈ పురస్కారానికి ఎంపిక చేయటం సముచితమన్నారు.పురస్కార గ్రహీత జీవీ పూర్ణచందు మాట్లాడుతూ… మానవత్వమే భీమన్న గారి తారక మంత్రమని చెప్పారు. కులాల అడ్డుగోడలను తొలగించడానికి కులాంతర వివాహాన్ని ఒక పరిష్కారంగా భీమన్న సూచించారని తెలిపారు. అవార్డుకు తన పేరు సూచించినందుకు భీమన్న సతీమణి హైమవతికి కృతజ్ఞతలు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. చిన్నతనంలో అనేక అవమానాలు అనుభవించానని, భవనం కూలి తీవ్ర గాయాలై కాలు విరిగి భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉన్న స్థితిలో బోయి భీమన్న గారి “పాలేరు” నాటకం స్ఫూర్తి నింపిందని చెప్పారు. “బానిసత్వం బాపు మమ్మా”, “భరతభూమికి భాగ్యము తేరా”వంటి భీమన్న గీతాలు స్ఫూర్తి మంత్రాలని అన్నారు.రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ వి. గంగులయ్య మాట్లాడుతూ… భీమన్న సామాజిక స్పృహ ప్రశంసనీయమని చెప్పారు. “గుడిసెలు కాలిపోతున్నాయి” రచన ద్వారా ఆయన సమాజాన్ని తట్టి లేపారని అన్నారు.అనంతరం మంత్రి కందుల దుర్గేష్ జీవి పూర్ణ చందు ను దుశ్శాలువా తో సత్కరించి,రెండు లక్షల రూపాయల నగదు పురస్కారం అందజేశారు. డాక్టర్ జి వి పూర్ణ చందు రచించిన భువనవిజయం పుస్తకాన్ని ఆవిష్కరించి, బహుమతిగా స్వీకరించారు.సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు చిత్రించిన “అఖండ తాండవం” చిత్తరువును(పెయింటింగ్) మంత్రి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మిశ, డిఆర్ఓ లక్ష్మీ నరసింహం,సాంస్కృతిక శాఖ సంచాలకులు మల్లికార్జునరావు, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, జానపద కళలు & సృజనాత్మక అకాడమీ చైర్మన్ వి. గంగులయ్య, బోయి భీమన్న సతీమణి హైమావతి, పురష్కార గ్రహీత డాక్టర్ జి .వి పూర్ణచందు, బోయి భీమన్న కుటుంబ సభ్యులు, భాషా సాంస్కృతిక శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
208 2 minutes read