అమరావతి, సెప్టెంబర్ 19 డాక్టర్ అబ్దుల్ కలాం గారి కలల సాకారం దిశగా ఆంధ్ర ప్రదేశ్ పల్లెల్లో అడుగులు• గతంలో అమలులో ఉన్న లోపభూయిష్ట విధానాల ప్రక్షాళన• క్లస్టర్ విధానం రద్దు… జనాభా, ప్రాంతం, ఆదాయ ప్రాతిపదికన గ్రేడ్లు• సిబ్బందిని సర్దుబాటు చేసుకుంటూ ఉత్తమ ఫలితాలు రాబట్టేలా సంస్కరణలు• త్వరలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కేబినెట్ ముందుకు నూతన విధానాలు• పంచాయతీల పునర్వర్గీకరణ, నూతన విధానాల అమలుపై సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారురాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గ్రామ పంచాయతీల్లో పట్టణ స్థాయి సౌకర్యాల కల్పన లక్ష్యంగా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి కలలను సాకారం చేస్తూ ప్రతి పల్లెలో మౌలిక వసతులు మెరుగుపరచే దిశగా పంచాయతీ కార్యాలయాల్లో పౌర సేవలు సత్వరమే సక్రమంగా అందేలా పాలన వ్యవస్థను పునర్వ్యవస్థీకరణ చేయబోతున్నారు. అందుకోసం గతంలో ఉన్న లోపభూయిష్ట విధానాలను గుర్తించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తారు. ఈ మేరకు శుక్రవారం శాసన సభలోని ఉపముఖ్యమంత్రి వారి కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక, న్యాయ శాఖల ఉన్నతాధికారులుతో పంచాయతీల పునర్వర్గీకరణ, నూతన సంస్కరణల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో అమలు చేస్తున్న విధానాలు, అందులో లోపాలు, చేయాల్సిన మార్పులు చేర్పుల ప్రజెంటేషన్ అధికారులు ఇచ్చారు. ఈ సందర్బంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు నూతనంగా అమలు చేయనున్న ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు.• దాదాపు 50ఏళ్ల నాటి సిబ్బంది నమూనాకు మార్పుచేర్పులు‘గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తుంది. ప్రస్తుతం అమలులో ఉన్న ఆర్ధిక వెనుకబాటు, లోపభూయిష్టమైన పరిపాలన వ్యవస్థలు పంచాయతీల ప్రగతికి అవరోధాలుగా మారాయి. 48 ఏళ్ల క్రితం ఉన్న సిబ్బంది నమూనాయే ఇప్పటికీ అమల్లో ఉంది. గతంలో అమలు చేసిన క్లస్టర్ విధానంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఈ విధానాల్లో సమూల మార్పులు తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు రూపకల్పన చేయాల్సిన బాధ్యత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై ఉంద’ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు.• గ్రేడ్లు నిర్ణయానికి ఆదాయమే ప్రాతిపదిక కాదుగతంలో ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని పంచాయతీలకు గ్రేడ్లు నిర్ణయించే వారు. ప్రస్తుతం మనం జనాభా, మండల కేంద్రం, గిరిజన, గిరిజనేతర ప్రాంతం, ఆదాయం అనే అంశాలను విశ్లేషించుకుని పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజించబోతున్నారు. ప్రతి పంచాయతీకి కార్యదర్శి స్థాయి అధికారి నుంచి ప్రతి స్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉంటారు. ప్రస్తుత క్లస్టర్ విధానంలో రెండు మూడు గ్రామ పంచాయతీల బాధ్యతలను ఒక సెక్రటరీ నిర్వహిస్తున్నారు. నూతన విధానంలో ప్రతి పంచాయతీకి గ్రేడ్ల వారీగా సెక్రటరీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.• మొదటి రోజు నుంచే పంచాయతీల్లో సంస్కరణలుపంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి పంచాయతీల్లో వెలుగులు నింపేలా శ్రీ పవన్ కల్యాణ్ గారు పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వంలో కోల్పోయిన సర్పంచుల గౌరవం నిలబెట్టేలా స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ఇచ్చే మొత్తాన్ని గణనీయంగా పెంచారు. మైనర్ పంచాయతీలకు ఇచ్చే మొత్తాన్ని రూ.100 నుంచి రూ. 10,000, మేజర్ పంచాయతీలకు రూ. 250 నుంచి రూ. 25,000కు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించారు. కేంద్రం నుంచి రావాల్సిన ఆర్ధిక సంఘం నిధులు గత ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించుకుని పంచాయతీల్లో డబ్బులు లేకుండా చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15వ ఆర్ధిక సంఘం నిధులు ఎప్పటికప్పుడు పంచాయతీల ఖాతాల్లో వేస్తున్నాం.• రికార్డు స్థాయిలో పదోన్నతులుఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారిని పంచాయతీరాజ్ గ్రామాణాభివృద్ధి శాఖల ఉద్యోగ సంఘాలు కలిసిన సందర్భంలో పదోన్నతులు గురించి తెలిపారు. పదోన్నతుల వ్యవహారం ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంది. ఉద్యోగుల సమస్యను ఎంతో సామరస్యపూర్వకంగా పరిష్కరించారు శ్రీ పవన్ కల్యాణ్ గారు. 10 వేల మందికిపైగా ఉద్యోగులకు ఒకేసారి పదోన్నతులు కల్పించారు. పంచాయతీల్లో ప్రగతి పరుగులు తీయాలి. అందుకోసం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రూర్బన్ పథకం సహకారంతో ప్రతి పంచాయతీలో మెరుగైన సౌకర్యాల కల్పన లక్ష్యంగా ముందుకు వెళ్తోంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.శుక్రవారం నాటి సమావేశంలో జి.ఏ.డి. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.ఎస్. రావత్ గారు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ వినయ్ చంద్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణతేజ, న్యాయశాఖ కార్యదర్శి శ్రీమతి ప్రతిభాదేవి, ఒ.ఎస్.డి. శ్రీ వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు
202 2 minutes read