గుంటూరు, సెప్టెంబర్ 20 :జిల్లాలో ఇటీవల బదిలీ చెందిన అధికారులైన పూర్వ కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి (ప్రస్తుతం జెన్కో మేనేజింగ్ డైరెక్టర్) మరియు పూర్వ సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ (ప్రస్తుతం సిఆర్డిఏ అడిషనల్ కమిషనర్) లకు జిల్లా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో శనివారం రాత్రి గుంటూరు కలెక్టరేట్‌లోని ఎస్ఆర్ శంకరన్ హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో ఘన సన్మానాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె ఖాజావలి, గుంటూరు రెవెన్యూ డివిజన్ అధికారి కె. శ్రీనివాసరావు, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
అధికారులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు బహుకరించారు. అనంతరం జరిగిన సభలో వారు జిల్లా అభివృద్ధికి తీసుకున్న చొరవ, సంక్షేమ పథకాల అమలులో చూపిన నిబద్ధతను ప్రముఖులు ప్రశంసించారు. వారి నేతృత్వంలో జిల్లా అనేక విజయాలు సాధించిందని, ప్రజల సంక్షేమం కోసం చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
ఈ సందర్భంగా ఎస్. నాగలక్ష్మి, ఏ. భార్గవ్ తేజ మాట్లాడుతూ – నూతన కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా నేతృత్వంలో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో సహకరించిన అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మండల డివిజన్ సాయి అధికారులు, కలెక్టరేట్‌లోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.